
గుజరాత్ ప్రభుత్వ మ్యాప్‌పై వివాదం
అక్సాయ్‌చిన్‌ను చైనాలో అంతర్భాగంగా చూపిన మ్యాప్
వివాదాస్పద ప్రాంతాలుగా అరుణాచల్, జమ్మూకాశ్మీర్
భారత్-చైనా మధ్య ఒప్పందం సందర్భంగా మ్యాప్‌ల పంపిణీ
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం, గుజరాత్ సర్కారు వివాదంలో చిక్కుకున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటన సందర్భంగా ఈ నెల 17న గుజరాత్ ప్రభుత్వంతో మూడు ఒప్పందాలు కుదరడం తెలిసిందే. వీటిపై సంతాకాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన మ్యాప్‌లు వివాదానికి కేంద్రబిందువయ్యాయి. ఈ మ్యాప్‌ల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ను, అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని చైనా భూభాగంగా చూపించారు. అలాగే భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ప్రదేశ్, కాశ్మీర్‌లోని అక్సాయ్‌చిన్‌లను వివాద ప్రాంతాలుగా మార్క్ చే శారు.
కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ సోమవారం ఢిల్లీలో ఈ మ్యాప్‌లను మీడియాకు విడుదల చేసి... గుజరాత్ ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘తీవ్రమైన అంశాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకుంటోంది. మోదీ సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ప్రభుత్వం, ప్రధాని వివరణ ఇవ్వాలి’’ అన్నారు. మోదీ, జిన్‌పింగ్ మధ్య జరిగిన ఒప్పందంలోనూ ఇదే మ్యాప్ ఉందా అని ప్రశ్నించారు. మోదీ దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. అయితే ఈ మ్యాప్ ఒప్పందాల్లో భాగం లేదని, ఇది గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, గ్వాంగ్ ఝో నగరాలను చూపుతూ రూపొందించినవని గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ స్పష్టం చేశాయి. ఈ మ్యాప్‌లకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంలేదన్నాయి.
అసలు సరిహద్దే నిర్ధారణ కాలేదు: చైనా
బీజింగ్: జమ్మూకాశ్మీర్‌లోని లడక్ సెక్టార్‌లో చైనా జవాన్ల, పౌరుల చొరబాట్లపై దేశం స్పందించింది. అసలు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) నిర్ధారణపై భారత్, చైనాల మధ్య విభిన్నమైన వాదనలున్నాయని, సరిహద్దు రేఖ నిర్ధారణ కాలేదని చైనా సైన్యం పేర్కొంది. సమస్యలుంటే ఉభయపక్షాలు చర్చలతో పరిష్కరించుకోవచ్చని చెప్పుకొచ్చింది.