పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో 25 లక్షల మంది నైపుణ్యానికి మెరుగులు దిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం రూ. 2వేల కోట్లను కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ కమిటీ మంగళవారం ఆమోదం తెలిపింది.
న్యూఢిల్లీ: పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో 25 లక్షల మంది నైపుణ్యానికి మెరుగులు దిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం రూ. 2వేల కోట్లను కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ కమిటీ మంగళవారం ఆమోదం తెలిపింది. అలాగే దీనికింద శిక్షకులకు ఇచ్చే ఇన్సెంటివ్ మొత్తాన్ని కూడా పెంచారు. ఒక్కో బ్యాచ్‌లో కనీసం 70%మంది అభ్యర్థులు కనీసం రూ. 6వేల జీతం వచ్చే ఉద్యోగాలు లభిస్తే ఆయా శిక్షకులకు రూ.3వేల ఇన్సెంటివ్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థులకు ప్రస్తుతం గంటకు రూ.15 వ్యయం చేస్తుండగా దాన్ని రూ.20-25కు పెంచారు. అభ్యర్థికి రోజుకు అన్ని ఖర్చులు కలిపి రూ.300 ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు.
వక్ఫ్ ఆస్తుల అమ్మకాలపై నిషేధం: వక్ఫ్ సవరణ బిల్లుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనిప్రకారం వక్ఫ్ ఆస్తుల అమ్మకాలు, తనాఖా, బహుమతి కింద ఇవ్వడంపై నిషేధం విధించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తులను తనఖాపెట్టి ఆపై అసాధారణ పరిస్థితుల్లో వాటిని అమ్మేందుకు అవకాశం ఉండటంతో అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
10వేల బస్సుల కొనుగోలుకు...: జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ పథకం (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కింద కొత్తగా సుమారు 10 వేల బస్సులను కొనుగోలుచేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.