
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు ఇప్పటివరకూ ఎంత ఖర్చు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 2014లో ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నాలుగేళ్లలో ప్రధాని 50 దేశాలకు పైగా 41 విదేశీ పర్యటనలు చేశారు. ఈ పర్యటనలకు రూ 355 కోట్లుపైగా ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించినట్టు ఆర్టీఐ కింద ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో వెల్లడైంది.
బెంగళూర్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెలుగుచూశాయి. ప్రధాని మోదీ ఇప్పటివరకూ తన 48 నెలల పదవీకాలంలో165 రోజుల పాటు విదేశీ పర్యటనల్లో గడిపినట్టు వెల్లడైంది. మరోవైపు గత 48 నెలల్లో ప్రధాని విదేశీ పర్యటన వివరాలతో కూడిన జాబితాను ప్రదాని కార్యాలయ వెబ్‌సైట్ పొందుపరించింది.
ఈ పర్యటనల్లో 30 సార్లు ప్రధాని ఉపయోగించిన చార్టర్డ్ విమానాల బిల్లులను ఇందులో చూపగా, 12 ఈ తరహా పర్యటనల బిల్లులను ఇంకా పొందుపరచలేదు. మోదీ విదేశీ పర్యటనల్లో ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల పర్యటనకు అత్యధికంగా రూ 31.25 కోట్లు ఖర్చు కాగా, భూటాన్ పర్యటనకు కేవలం రూ 2.45 కోట్లు ఖర్చయినట్టు వెల్లడించారు.