కోయంబత్తూరుకు కదిలిన నోట్ల కట్టలు
- 195 బాక్సుల్లో నోట్ల కట్టలు
- లెక్కింపు పర్వం పూర్తి
- ఇంకా ఈసీ గుప్పెట్లో రూ.570 కోట్లు
- ఢిల్లీకి నివేదిక
సాక్షి, చెన్నై: తిరుపూర్ కలెక్టరేట్ నుంచి నోట్ల కట్టలతో కూడిన కంటైనర్లు కోయంబత్తూరుకు కదిలాయి. అక్కడి ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో నోట్ల కట్టల లెక్కింపు పర్వం ముగిసింది. అయితే అధికార పూర్వకంగా ఆ నగదును ఎస్‌బీఐ వర్గాలకు అప్పగించనున్నట్టు సమాచారం. లెక్కింపు పర్వంతో నివేదికను ఢిల్లీకి పంపించి తదుపరి ఈ వ్యవహారాన్ని ఎన్నికల యంత్రాంగం కొలిక్కి తీసుకురానున్నది. నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా సాగిన తనిఖీల్లో తిరుపూర్‌లో పట్టుబడ్డ మూడు లారీల వైపు రాష్ట్రం చూపు మరలింది. ఆ లారీల్లో రూ.570 కోట్లు ఉన్నట్లు తేలడంతో ఆ నగదు ఎవరిదో అన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో ఓటర్లకు పంచే యత్నంలో భాగంగానే ఈ కంటైనర్లు రాష్ట్రంలోకి వచ్చినట్టుగా తొలుత ప్రచారం సాగింది. అయితే ఆ నగదు తమదేనంటూ ఎస్‌బీఐ ముందుకు రావడంతో ఆ లారీలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సి వచ్చింది.
నాలుగు రోజులపాటుగా ఆ కంటైనర్ లారీలను తిరుపూర్ కలెక్టరేట్ వద్ద గట్టి భద్రత నడమ ఉంచారు. ఎన్నికల పర్వం ముగియడంతో ఆ కంటైనర్లు అక్కడి నుంచి కదిలాయి. వీటిని భారీ భద్రత నడుమ కోయంబత్తూరులోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ బ్యాంక్ వర్గాలు, ఆదాయ పన్ను శాఖ, ఎన్నికల పర్యవేక్షకుల సమయంలో ఆ నగదును లెక్కించే పనిలో పడ్డారు. ఒక కంటైనర్‌లో 60, మరో కంటైనర్‌లో 65, ఇంకో కంటైనర్‌లో 70 చొప్పున మొత్తం 195 బాక్సుల్లో రూ.వంద, రూ.ఐదువందలు, రూ.వెయ్యి నోట్లు ఉన్నట్టుగా పరిశీలనలో తేలింది. ఆ నగదు లెక్కింపు ప్రక్రియను ఆరుగంటల పాటుగా అధికార వర్గాలు నిర్వహించాయి.
మంగళవారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో లెక్కింపు పర్వం ముగియగానే, ఆదాయ పన్ను, ఎన్నికల అధికారులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అయితే ఆ నగదు ఎస్‌బీఐకు అప్పగింత తదితర అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, నిఘా నేత్రాల నడుమ సాగిన ఈ లెక్కింపులో ఎంత మొత్తం నగదు ఉన్నదో పరిశీలించి, అందుకు తగ్గ నివేదికను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీకి సమర్పించనున్నారు.
ఈ నివేదికను కేంద్ర ఎన్నికల కమిషనర్ నజీం జైదీకి పంపించి, ఆయన ఇచ్చే ఆదేశాల మేరకు ఎస్‌బీఐకు అధికార పూర్వకంగా ఆ నగదు అప్పగించబోతున్నారు. దీంతో ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం నిఘా వలయంలోకి తీసుకొచ్చి ఉన్నారు. కంటైనర్లు పట్టుబడ్డ సమయంలో రూ.570 కోట్లు ఉన్నట్టుగా సంబంధిత అధికారులు ప్రకటించిన నేపథ్యంలో, తాజా లెక్కింపులో అంత కన్నా ఎక్కువగా ఉంటే, ఎన్నికల యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.