కంటైనర్లలో రూ.570 కోట్లు
♦ తమిళనాడులో స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు
♦ ఆ డబ్బు మాదే: ఎస్‌బీఐ
సాక్షి ప్రతినిధి, చెన్నై: కోటి .. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ. 570 కోట్లు. అంత మొత్తం చూసేసరికి తనిఖీలు చేస్తోన్న ఎన్నికల అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. నిజమా.. కలా అంటూ నోరెళ్ల బెట్టారు. ఎన్నికలకు మరో రెండ్రోజులు ఉందనగా తమిళనాడులోని తిరుపూరు జిల్లా సెంగపల్లి సమీపంలో రూ.570 కోట్లను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి 12.40 గంటలకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహనాల్ని తనిఖీ చేస్తూ.. మూడు కంటైనర్లను ఆపేందుకు ప్రయత్నించారు. కంటైనర్లతో పాటు వెంట కాపలా ఉన్న మూడు కార్లు ఆగకుండా వెళ్లడంతో చెంగపల్లి వద్ద వెంబడించి పట్టుకున్నారు.
కంటైనర్లను తనిఖీ చేయగా పెట్టెల్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఆ డబ్బును కొయంబత్తూరు ఎస్‌బీఐ బ్రాంచి నుంచి విశాఖపట్నం బ్రాంచ్‌కు తీసుకెళ్తున్నామని, తాము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసులమంటూ కార్లలోని సిబ్బంది వెల్లడించారు. కార్లను వెంబడించడంతో దోపిడీ జరుగుతోందని భయపడి ఆపకుండా వెళ్లినట్లు వారు చెప్పారు. అయితే సరైన పత్రాలు చూపకపోవడంతో పారా మిలటరీ సిబ్బంది సాయంతో కంటైనర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. డబ్బుకు సంబంధించిన జిరాక్స్ పేపర్లు మాత్రమే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. విషయాన్ని ఎస్‌బీఐ అధికారులకు తెలియచేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సమర్పించారు.
ఆ డబ్బును ఆంధ్రాకు తీసుకెళ్తున్నాం: ఎస్‌బీఐ
తమిళనాడులో పట్టుబడ్డ రూ. 570 కోట్ల నగదు తమదేనంటూ ఎస్‌బీఐ శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నగదు కొరతను తీర్చేందుకు ఆర్బీఐ కోరడంతో డబ్బును తరలిస్తున్నామని తెలిపింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు కొయంబత్తూర్ ఎస్‌బీఐ కోశాగారం నుంచి ఏపీ పోలీసుల రక్షణలో తీసుకెళ్తుండగా ఎన్నికల అధికారులు పట్టుకున్నారంటూ ఆ ప్రకటనలో వెల్లడించింది. చెన్నై, కొయంబత్తూరు, తిరుపూర్‌లోని బ్యాంకు సిబ్బంది ఎన్నికల అధికారులకు అన్ని వివరాలు సమర్పించారని చెప్పింది.