Rs.570 crores seized
-
‘రూ. 570 కోట్ల’ వ్యవహారంపై సీబీఐ విచారణ
తమిళనాడు ఎన్నికల సమయంలో రవాణా అవుతూ పట్టుబడిన రూ. 570 కోట్ల విషయంలో సీబీఐ విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ దాఖలు చేసిన పిటిషన్‌కు మద్దతుగా తగిన ఆధారాలుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా సీబీఐకి కోర్టు తెలిపింది. ఆ మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినదంటూ చెబుతున్న అంశంలో వాస్తవికతను అనుమానిస్తూ ఇళంగోవన్ పిటిషన్ దాఖలుచేశారు. మే 16న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగగా, సరిగ్గా 13వ తేదీన ఎన్నికల కమిషన్ నిఘా బృందం తిరుపూర్ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న కంటెయినర్లను వెంటాడి పట్టుకుని చూడగా అందులో రూ. 570 కోట్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ కంటెయినర్లను తిరుపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పార్కింగ్ చేసి ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం క్యాష్ చెస్ట్‌కు ఆ డబ్బు తరలిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. అయితే, అంత పెద్ద మొత్తాన్ని తరలిస్తుంటే స్థానిక పోలీసుల ఎస్కార్టు ఉండాలని, అలా ఏమీ జరగలేదని ఇళంగోవన్ అంటున్నారు. పైగా డబ్బు తరలిస్తున్నట్లు చెప్పేందుకు తగిన ఆధారాలు ఏమీ లేవని తెలిపారు. -
కోయంబత్తూరుకు కదిలిన నోట్ల కట్టలు
- 195 బాక్సుల్లో నోట్ల కట్టలు - లెక్కింపు పర్వం పూర్తి - ఇంకా ఈసీ గుప్పెట్లో రూ.570 కోట్లు - ఢిల్లీకి నివేదిక సాక్షి, చెన్నై: తిరుపూర్ కలెక్టరేట్ నుంచి నోట్ల కట్టలతో కూడిన కంటైనర్లు కోయంబత్తూరుకు కదిలాయి. అక్కడి ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో నోట్ల కట్టల లెక్కింపు పర్వం ముగిసింది. అయితే అధికార పూర్వకంగా ఆ నగదును ఎస్బీఐ వర్గాలకు అప్పగించనున్నట్టు సమాచారం. లెక్కింపు పర్వంతో నివేదికను ఢిల్లీకి పంపించి తదుపరి ఈ వ్యవహారాన్ని ఎన్నికల యంత్రాంగం కొలిక్కి తీసుకురానున్నది. నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా సాగిన తనిఖీల్లో తిరుపూర్‌లో పట్టుబడ్డ మూడు లారీల వైపు రాష్ట్రం చూపు మరలింది. ఆ లారీల్లో రూ.570 కోట్లు ఉన్నట్లు తేలడంతో ఆ నగదు ఎవరిదో అన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో ఓటర్లకు పంచే యత్నంలో భాగంగానే ఈ కంటైనర్లు రాష్ట్రంలోకి వచ్చినట్టుగా తొలుత ప్రచారం సాగింది. అయితే ఆ నగదు తమదేనంటూ ఎస్బీఐ ముందుకు రావడంతో ఆ లారీలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సి వచ్చింది. నాలుగు రోజులపాటుగా ఆ కంటైనర్ లారీలను తిరుపూర్ కలెక్టరేట్ వద్ద గట్టి భద్రత నడమ ఉంచారు. ఎన్నికల పర్వం ముగియడంతో ఆ కంటైనర్లు అక్కడి నుంచి కదిలాయి. వీటిని భారీ భద్రత నడుమ కోయంబత్తూరులోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ బ్యాంక్ వర్గాలు, ఆదాయ పన్ను శాఖ, ఎన్నికల పర్యవేక్షకుల సమయంలో ఆ నగదును లెక్కించే పనిలో పడ్డారు. ఒక కంటైనర్‌లో 60, మరో కంటైనర్‌లో 65, ఇంకో కంటైనర్‌లో 70 చొప్పున మొత్తం 195 బాక్సుల్లో రూ.వంద, రూ.ఐదువందలు, రూ.వెయ్యి నోట్లు ఉన్నట్టుగా పరిశీలనలో తేలింది. ఆ నగదు లెక్కింపు ప్రక్రియను ఆరుగంటల పాటుగా అధికార వర్గాలు నిర్వహించాయి. మంగళవారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో లెక్కింపు పర్వం ముగియగానే, ఆదాయ పన్ను, ఎన్నికల అధికారులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అయితే ఆ నగదు ఎస్బీఐకు అప్పగింత తదితర అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, నిఘా నేత్రాల నడుమ సాగిన ఈ లెక్కింపులో ఎంత మొత్తం నగదు ఉన్నదో పరిశీలించి, అందుకు తగ్గ నివేదికను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీకి సమర్పించనున్నారు. ఈ నివేదికను కేంద్ర ఎన్నికల కమిషనర్ నజీం జైదీకి పంపించి, ఆయన ఇచ్చే ఆదేశాల మేరకు ఎస్బీఐకు అధికార పూర్వకంగా ఆ నగదు అప్పగించబోతున్నారు. దీంతో ఎస్బీఐ ప్రధాన కార్యాలయం నిఘా వలయంలోకి తీసుకొచ్చి ఉన్నారు. కంటైనర్లు పట్టుబడ్డ సమయంలో రూ.570 కోట్లు ఉన్నట్టుగా సంబంధిత అధికారులు ప్రకటించిన నేపథ్యంలో, తాజా లెక్కింపులో అంత కన్నా ఎక్కువగా ఉంటే, ఎన్నికల యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
ఆ రూ. 570 కోట్ల నగదుపై తేల్చని ఈసీ
కోయంబత్తూరు: తమిళనాడులో ఎన్నికలకు ముందు పట్టుబడిన 570 కోట్ల రూపాయల నగదుపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ డబ్బును కోయంబత్తూరుకు తరలించి.. ఆర్బీఐ, ఎస్బీఐ, ఐటీ అధికారులను ఎన్నికల సంఘం అధికారులు విచారిస్తున్నారు. ఈ డబ్బును కంటెయినర్లలో తరలిస్తుండగా తమిళనాడులో తిరుపూరు జిల్లా పెరుమనలూరు - కునత్తూరు బైపాస్‌రోడ్డులో దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు ఈ డబ్బును సీజ్ చేసి జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత విశాఖపట్నం ఎస్బీఐ-ఎస్సీఏ బ్రాంచ్ అధికారులు ఈ డబ్బు తమదేనని చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదును తెప్పిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులకు వివరాలు అందజేశారు. అయితే ఎన్నికల సంఘం అధికారులు ఈ డబ్బును ఇంకా బ్యాంక్ అధికారులకు అప్పగించలేదు. పూర్తిస్థాయి విచారణ అనంతరం ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. -
కంటైనర్లలో రూ.570 కోట్లు
♦ తమిళనాడులో స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు ♦ ఆ డబ్బు మాదే: ఎస్బీఐ సాక్షి ప్రతినిధి, చెన్నై: కోటి .. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ. 570 కోట్లు. అంత మొత్తం చూసేసరికి తనిఖీలు చేస్తోన్న ఎన్నికల అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. నిజమా.. కలా అంటూ నోరెళ్ల బెట్టారు. ఎన్నికలకు మరో రెండ్రోజులు ఉందనగా తమిళనాడులోని తిరుపూరు జిల్లా సెంగపల్లి సమీపంలో రూ.570 కోట్లను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి 12.40 గంటలకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహనాల్ని తనిఖీ చేస్తూ.. మూడు కంటైనర్లను ఆపేందుకు ప్రయత్నించారు. కంటైనర్లతో పాటు వెంట కాపలా ఉన్న మూడు కార్లు ఆగకుండా వెళ్లడంతో చెంగపల్లి వద్ద వెంబడించి పట్టుకున్నారు. కంటైనర్లను తనిఖీ చేయగా పెట్టెల్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఆ డబ్బును కొయంబత్తూరు ఎస్బీఐ బ్రాంచి నుంచి విశాఖపట్నం బ్రాంచ్‌కు తీసుకెళ్తున్నామని, తాము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసులమంటూ కార్లలోని సిబ్బంది వెల్లడించారు. కార్లను వెంబడించడంతో దోపిడీ జరుగుతోందని భయపడి ఆపకుండా వెళ్లినట్లు వారు చెప్పారు. అయితే సరైన పత్రాలు చూపకపోవడంతో పారా మిలటరీ సిబ్బంది సాయంతో కంటైనర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. డబ్బుకు సంబంధించిన జిరాక్స్ పేపర్లు మాత్రమే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. విషయాన్ని ఎస్బీఐ అధికారులకు తెలియచేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సమర్పించారు. ఆ డబ్బును ఆంధ్రాకు తీసుకెళ్తున్నాం: ఎస్బీఐ తమిళనాడులో పట్టుబడ్డ రూ. 570 కోట్ల నగదు తమదేనంటూ ఎస్బీఐ శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నగదు కొరతను తీర్చేందుకు ఆర్బీఐ కోరడంతో డబ్బును తరలిస్తున్నామని తెలిపింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు కొయంబత్తూర్ ఎస్బీఐ కోశాగారం నుంచి ఏపీ పోలీసుల రక్షణలో తీసుకెళ్తుండగా ఎన్నికల అధికారులు పట్టుకున్నారంటూ ఆ ప్రకటనలో వెల్లడించింది. చెన్నై, కొయంబత్తూరు, తిరుపూర్‌లోని బ్యాంకు సిబ్బంది ఎన్నికల అధికారులకు అన్ని వివరాలు సమర్పించారని చెప్పింది. -
ఆ 570 కోట్ల రూపాయల నగదు మాదే
విశాఖపట్నం: తమిళనాడులో కంటెయినర్లలో తరలిస్తుండగా పట్టుబడిన 570 కోట్ల రూపాయల నగదుపై మిస్టరీ వీడింది. ఈ డబ్బు తమదేనని విశాఖపట్నం ఎస్బీఐ-ఎస్సీఏ బ్రాంచ్ అధికారులు చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదును తెప్పిస్తున్నట్టు తెలిపారు. నగదు కావాలని ఈ నెల 11న రిజర్వ్బ్యాంక్ను కోరామని, కోయంబత్తూరులో అందుబాటులో ఉండటంతో అక్కడి నుంచి విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు బ్యాంక్ అధికారులు తెలిపారు. విమానంలో డబ్బు తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయని, దీంతో ఎస్కార్టుతో రోడ్డు మార్గంలో నగదు తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు. డబ్బును తరలించేందుకు విశాఖపట్నం నుంచే ఎస్కార్టును పంపించామని తెలిపారు. తమిళనాడు పోలీసులకు డబ్బుకు సంబంధించిన ఆధారాలిచ్చామని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. తమిళనాడులో తిరుపూరు జిల్లా పెరుమనలూరు - కునత్తూరు బైపాస్‌రోడ్డులో ఈ నగదు దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తుండగా మూడు కంటెయినర్లలో రూ. 570 కోట్ల నగదు పట్టుబడింది. -
ఆ కంటెయినర్ల వెనుక మరో మూడు కార్లు!
తమిళనాడులో ఎన్నికలకు ముందు దొరికిన రూ. 570 కోట్ల నగదుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తిరుపూరు జిల్లా పెరుమనలూరు - కునత్తూరు బైపాస్‌రోడ్డులో ఈ నగదు దొరికిన విషయం తెలిసిందే. ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తుండగా మూడు కంటెయినర్లలో రూ. 570 కోట్ల నగదు పట్టుబడింది. అయితే.. ఈ మూడు కంటెయినర్లను వెనక నుంచి మూడు కార్లు కూడా ఫాలో అవుతున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. పోలీసులు ఆపగానే కంటెయినర్లను వదిలిపెట్టి మూడు కార్లు వెనక్కి తిప్పి తీసుకెళ్లిపోయారు. ఈ మూడు కార్లను పోలీసులు వెంటాడి చెంగపల్లి సమీపంలో పట్టుకున్నారు. కార్లలో ఉన్న వ్యక్తులను తమిళనాడు పోలీసులు ప్రశ్నించగా.. తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులమని వారు చెప్పారు. పోలీసు యూనిఫాం వేసుకోలేదమని ప్రశ్నించగా సమాధానం లేదు. పోనీ ఐడీ కార్డులు ఏవని అడిగినా చూపించలేకపోయారు. కంటెయినర్లు ఆపితే మీరెందుకు పారిపోయారని ప్రశ్నిస్తే.. దొంగలు వచ్చారనుకుని పారిపోయామన్నారు. వాళ్లను పట్టుకున్న పోలీసులు.. కలెక్టర్, ఎస్పీల వద్ద ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వాళ్లు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దాంతో.. ఎస్బీఐ లేదా ఆర్బీఐ నుంచి తగిన వివరాలతో కూడిన లేఖలు తమకు అందిన తర్వాత మాత్రమే నగదు విడిచిపెడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఇంతవరకు అసలు ఆ నగదు గురించి అటు బ్యాంకు వర్గాలు గానీ, ఇటు ఆర్బీఐ గానీ తమిళనాడు పోలీసులను సంప్రదించలేదు. ఆధారాలు ఏమైనా వస్తే నగదు పంపిస్తామని, లేనిపక్షంలో దీని వెనుక ఉన్నవాళ్లమీద కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అర్ధరాత్రి 12 గంటలకు కోయంబత్తూరులో లారీలు బయల్దేరగా, 12.40 గంటలకే వాటిని తిరుపూరు సమీపంలో పట్టుకున్నారు. అంత అర్ధరాత్రి సమయంలో అసలు అంత పెద్ద మొత్తాన్ని, అది కూడా సెక్యూరిటీ లేకుండా ఎలా పంపారో అర్థం కావట్లేదు. అంత నగదు తరలిస్తుంటే చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి వెంట ఉండాలి. కానీ ఎవరూ లేరు. వాళ్ల వద్ద ఉన్న ఇన్వాయిస్లో కూడా సూరిబాబు అనే వ్యక్తి ద్వారా విశాఖపట్నంలోని బాలాజీనగర్ మెయిన్ బ్రాంచికి తరలిస్తున్నట్లు పత్రాల్లో పేర్కొన్నారు. సాధారణంగా అలాంటి సందర్భాల్లో ఆర్బీఐ అనుమతితోపాటు తగినంత సెక్యూరిటీ కూడా ఉండాలి. కానీ అవేవీ లేకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఒక్కసారిగా వైజాగ్ బ్రాంచికి ఇంత పెద్ద మొత్తం తరలించడం ఎందుకని, ఎవరైనా ప్రైవేటు వ్యక్తుల ఖాతాల కోసం తరలిస్తున్నారా అని విచారణ జరుపుతున్నారు. కంటెయినర్లను ముందు ఆపకపోవడంతో.. తర్వాత పట్టుకున్నాక కూడా వాటిలో ఉన్నవాళ్లు అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పడం అన్నీ అనుమానాలను బలపరిచాయి. -
రూ.570కోట్లపై స్పందించిన విశాల్
తమిళనాట సినీరంగానికి, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. అందుకే రాజకీయంగా జరిగే ప్రతీ పరిణామం పై సినీతారలు తమ అభిప్రాయాలను చెపుతుంటారు. తాజాగా నడిగర్ సంఘం వివాదంతో పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా మారిన యంగ్ హీరో విశాల్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. తాజాగా తమిళనాడు ఎలక్షన్ల సందర్భంగా భారీ మొత్తంలో డబ్బు దొరకటం ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఎలక్షన్ సమయం దగ్గర పడుతుంటంతో తమిళనాట డబ్బు ఏరులై పారుతోంది. కనివినీ ఎరుగని రీతిలో ఒకేసారి మూడు కంటైనర్ లలో 570 కోట్ల డబ్బు దొరకటం సామాన్య ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలకు కూడా షాక్ ఇచ్చింది. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా దొరికిన ఆ భారీ నగదును చిన్న పిల్లల చదువు, మధ్యాహ్న భోజన పథకాలకు వినియోగించాలంటూ సలహా ఇచ్చాడు విశాల్. 570 cr seized in Tirupur without documents??? wish they use it for children education n mid day meal scheme.wil b enuf for 570cr kids — Vishal (@VishalKOfficial) 14 May 2016 -
కంటైనర్లలో రూ.570కోట్లు స్వాధీనం
కోయంబత్తూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగదు ఏరులై పారుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కోట్ల రూపాయిలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల అధికారులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా గతరాత్రి తనిఖీల్లో భాగంగా కోయంబత్తూరు, తిర్పూరు జిల్లాలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. కోయంబత్తూరు బైపాస్ రోడ్డు వద్ద ఓ కంటైనర్‌లో రూ.195 కోట్లు సీజ్ చేయగా, తిర్పూరు జిల్లాలో మూడు కంటైనర్లను ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ స్వాధీనం చేసుకుంది. ఆ కంటైనర్లలో రూ.570 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఈ కంటైనర్లు కోయంబత్తూరు నుంచి విజయవాడ వెళుతున్నట్లు సమాచారం. అధికారుల విచారణలో భాగంగా విజయవాడ ఎస్బీఐ బ్యాంక్‌లో నగదును డిపాజిట్ చేసేందుకు వెళుతున్నట్లు కంటైనర్ డ్రైవర్ తెలిపాడు. స్వాధీనం చేసుకున్న కంటైనర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. నగదు తరలింపుపై విచారణ జరుపుతున్నట్లు తమిళనాడు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజేశ్ లహోని తెలిపారు. కాగా కంటైనర్లతో పాటు ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు, సంస్థ యూనిఫాంలో లేడని, అంతేకాకుండా నగదు తరలింపుపై అతని వద్ద పూర్తి వివరాలతో కూడిన పత్రాలు లేవన్నారు. కాగా ఈనెల 16వ తేదీ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం అనేక రకాలైన చర్యలు చేపట్టింది. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు యధేచ్చగా నగదు పంపిణీలో నిమగ్నమైపోయాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తమిళనాడులో సుమారు రూ.100 కోట్లు అక్రమ నగదును అధికారులు సీజ్ చేశారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇంత భారీగా నగదును సీజ్ చేయడం దేశంలోనే ప్రథమం. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రూ.140 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.