రూ.871 కోట్ల నల్లధనం!
గుజరాత్‌లోని సహకార బ్యాంకులో భారీగా అక్రమాలు
♦ ఐటీ శాఖ విచారణలో వెల్లడి
♦ ఒకేసారి 4,500 కొత్త ఖాతాలు, 62 ఖాతాలకు ఒకే ఫోన్ నెంబర్
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం అనంతరం మొదటిసారి అత్యంత భారీ మొత్తంలో అక్రమ నగదు లావాదేవీల్ని ఐటీ శాఖ గుర్తించింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ కేంద్రంగా పనిచేస్తున్న సహకార బ్యాంకులో గతేడాది నవంబర్ 9 – డిసెంబర్ 30 మధ్య రూ. 871 కోట్ల మేర డిపాజిట్లు చేశారని ఒక నివేదికలో వెల్లడించింది. అందుకోసం 4,500కు పైగా కొత్త ఖాతాలు తెరిచారని, 62 ఖాతాలకు ఒకే ఫోన్ నెంబర్ ఇచ్చారని ఐటీ అధికారులు తెలిపారు. నోట్ల రద్దు అనంతరం సహకార బ్యాంకులపై నిఘా పెట్టిన ఐటీ శాఖ కొద్ది రోజుల క్రితం రాజ్‌కోట్ బ్యాంకులో భారీ అవకతవకలు జరిగినట్లు నిర్ధారించుకుంది. రంగంలోకి దిగిన అహ్మదాబాద్ విభాగం అధికారులు ఆదాయపు పన్ను చట్టం కింద విచారణ కొనసాగించగా దిమ్మదిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి.
డిపాజిట్లలో అధిక శాతం రద్దైన నోట్లే
‘ఇంతవరకూ రూ. 871 కోట్లు గుర్తించాం. డిపాజిట్లలో ఎక్కువ శాతం పాత రూ. 500, రూ 1000 నోట్లే. నవంబర్ 9– డిసెంబర్ 30 మధ్య రూ.108 కోట్లు విత్‌డ్రా చేశారు. 2015లోగానీ, అంతకుముందు సంవత్సరాల్లో ఎప్పుడూ ఆ స్థాయిలో కార్యకలాపాలు జరగలేదు’ అని ఐటీ శాఖ పేర్కొంది. 25 సార్లు భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేసినట్లు గుర్తించడంతో పాటు, అందులో రూ. 30 కోట్లు జమ చేసే సమయంలో కేవైసీ నిబంధనలు పాటించలేదని నిర్ధారించారు. వాడుకలో లేని ఖాతాల్లో రూ. 10 కోట్లు జమ చేయగా... పెట్రోలియం సంస్థకు చెందిన ఖాతాలో రూ. 2.53 కోట్లు డిపాజిట్ చేశారు.
పాన్ నెంబర్లు లేకుండానే డిపాజిట్లు
ఏడాదిలో 5 వేల ఖాతాలు తెరిచేందుకు అవకాశముండగా... నెల వ్యవధిలోనే 4,551 కొత్త ఖాతాలు తెరవడంపై ఐటీశాఖ విచారణ చేస్తోంది. డిపాజిట్ల సమయంలో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారని, ఎందులోను పాన్ నెంబర్లు రాయలేదని పేర్కొంది. చాలా పత్రాలపై జమ చేసే వ్యక్తి సంతకం లేదని, ఆదాయం ఎలా వచ్చిందో పేర్కొనే పత్రాల్ని కూడా జత చేయలేదని తెలిపింది.