దిమ్మతిరిగేరీతిలో వెలుగులోకి నల్లధనం
- ఒకేరోజు పట్టుబడ్డ 32 కోట్ల కొత్త కరెన్సీ.. 82 కిలోల బంగారం!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఒకవైపు కనీస అవసరాలకు నగదు దొరకకు సామాన్యలు అవస్థలు పడుతుండగా.. మరోవైపు నల్లధన కుబేరుల వద్ద దిమ్మతిరిగేరీతిలో కొత్త కరెన్సీ కట్టలు దొరకుతూనే ఉన్నాయి. ఒక్క శనివారమే దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఏకంగా 44 కోట్ల నగదు, 82 కిలోల బంగారం దొరికింది. ఇందులో 32 కోట్లు తళతళ మెరిసే కొత్త నోట్లే కావడం గమనార్హం.
ఢిల్లీ పోలీసులు శనివారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని టీ అండ్ టీ న్యాయసేవల సంస్థపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఏకంగా రూ. 13.65 కోట్లు పట్టుబడ్డాయి. ఇందులో రూ. 2.6 కోట్లు కొత్త కరెన్సీ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ సంస్థ ప్రమోటర్ రోహిత్ టండన్ గురించి పోలీసులు గాలిస్తున్నారు.
కర్ణాటకలో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో 5.7 కోట్ల నగదు, 32 కిలోల బంగారం వెలుగుచూసింది. చల్లకెరే పట్టణంలోని ఓ హవాలా డీలర్ ఇంట్లోని రహస్య బాత్‌రూమ్ చాంబర్‌లో ఈ నగదు, బంగారం వెలుగుచూడటం గమనార్హం. ఇందులో 90 లక్షలు రద్దైన పాతనోట్లు కాగా మిగతా అంత కొత్త కరెన్సీ నోట్లే. ఇక గోవా పనాజీలోని ఐటీ విభాగం అధికారులు హుబిలీ, చిత్రదుర్గ జిల్లాల్లోని బులియన్, క్యాసినో వ్యాపారుల ఇళ్లపై దాడులు కొనసాగిస్తున్నారు.
మరోవైపు ఐటీ అధికారుల అదుపులో ఉన్న టీటీడీ సభ్యుడు, తెలుగు వ్యాపారవేత్త శేఖర్‌రెడ్డికి సంబంధించి నల్లధనం వెలుగుచూస్తేనే ఉంది. తమిళనాడు వేలూరులో ఓ కారులో ఐటీ అధికారులు రూ. 24 కోట్లు, 50 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఐటీ దాడుల్లో నల్లధనం పట్టుబడటంతో శేఖర్‌రెడ్డిని, ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్టైన ముగ్గురు వ్యక్తులు విచారణలో ఇచ్చిన సమాచారంతో శేఖర్‌రెడ్డికి సంబంధించిన ఈ నల్లధనాన్ని పట్టుకున్నారు. శుక్రవారం శేఖర్‌రెడ్డికి సంబంధించిన రూ. 90 కోట్లు నగదు (ఇందులో రూ. 9.63 కోట్లు రెండువేల నోటు రూపంలో ఉన్న కొత్త కరెన్సీ), 127 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దనోట్ల రద్దు తర్వాత అత్యధికమొత్తంలో నల్లధనం పట్టుబడింది ఈ కేసులోనే కావడం గమనార్హం.