రూ.4900 కోట్ల బ్లాక్‌మనీ బహిర్గతం
రూ.4900 కోట్ల బ్లాక్‌మనీ బహిర్గతం
Published Thu, Sep 7 2017 7:53 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లధనం వెల్లడికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన 'ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన' (పీఎంజీకేవై) కింద భారీగా బ్లాక్‌మనీ బహిర్గతమైంది. ఈ స్కీమ్ కింద 21వేల మంది ప్రజలు రూ.4900 కోట్ల విలువైన బ్లాక్‌మనీని బయటికి వెల్లడించినట్టు ప్రభుత్వ అధికారులు గురువారం చెప్పారు. ఈ వెల్లడితో ఇప్పటి వరకు వీటిపై రూ.2451 కోట్ల పన్నులను కూడా వసూలు చేసినట్టు ఆదాయపు పన్ను అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. ఇవే తుది గణాంకాలుగా కూడా అధికారులు పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో ఈ నగదు వెల్లడించిన వారిపై(డిక్లరెంట్లపై) న్యాయప్రక్రియను కూడా ఆదాయపు పన్ను శాఖ చేపట్టినట్టు వివరించారు.
గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం ఈ స్కీమ్‌ను లాంచ్ చేసింది. 50 శాతం పన్ను, జరిమానాలను ఈ స్కీమ్ కింద బహిర్గతం చేసిన బ్లాక్‌మనీపై చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాక 25 శాతం బ్లాక్‌మనీని జీరో వడ్డీరేటుతో నాలుగేళ్ల పాటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిందే. మార్చి 31తో ఈ పథకం ముగిసింది. పీఎంజీకేవై మాదిరిగానే మరిన్ని పథకాలను తీసుకురానున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఐడీఎస్(ఇన్‌కమ్ డిక్లరేషన్ స్కీమ్) తర్వాత పీఎంజీకేవైను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2016 జూన్ 1 నుంచి 2016 సెప్టెంబర్ 30 వరకు తెరచి ఉంచిన ఐడీఎస్ స్కీమ్ కింద రూ.67,382 కోట్ల బ్లాక్‌మనీ బయటికి వచ్చింది.
Advertisement