నోట్లరద్దుతో ఎంత నల్లధనం వెల్లడైందో తెలుసా?
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా నల్లధనంపై ఆదాయపన్నుశాఖ (ఐటీ) ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 9 నుంచి దేశవ్యాప్తంగా నల్లకుబేరులు లక్ష్యంగా దాడులు జరుపుతున్న ఐటీ ఇప్పటివరకు రూ. 3,300 కోట్ల నల్లసంపదను వెలుగులోకి తెచ్చింది. అంతేకాకుండా ఐటీ దాడుల ద్వారా రూ. 92 కోట్ల కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకుంది.
అధికార వర్గాల సమాచారం ప్రకారం.. నోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకు ఐటీ అధికారులు 734 దాడులు, సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా పన్ను ఎగవేత, హవాలా వ్యాపారం, వెల్లడించని సంపద తదితర అభియోగాలకు సంబంధించి 3,200 మందికి నోటీసులు పంపించారు. పెద్దఎత్తున జరిగిన ఈ దాడులు, సోదాల్లో 500 కోట్లకుపైగా విలువచేసే బంగారం, అభరణాలు, నగదు లభించాయి. అంతేకాకుండా రూ. 92 కోట్లు కొత్త రెండువేల నోట్ల రూపంలో ఉన్న కరెన్సీని పట్టుకుంది. మొత్తం రూ. 500 కోట్ల ఆస్తులు ఐటీశాఖ ఇప్పటివరకు స్వాధీనంచేసుకోగా.. అందులో రూ. 421 కోట్లు రద్దైన పాత కరెన్సీ రూపంలో ఉంది. ఈ ఐటీ దాడులకు సంబంధించి 220 సీరియస్ కేసుల విచారణ బాధ్యతను తన సోదర సంస్థలైన సీబీఐ, ఈడీలకు ఐటీశాఖ అప్పగించిందని అధికార వర్గాలు తెలిపాయి.