నల్లధనానికి కౌంట్‌డౌన్ మొదలు!
⇒ బ్లాక్‌మనీ వెల్లడి స్కీమ్.. ‘పీఎంజీకేవై’కు ఇంకా వారం రోజులే గడువు
⇒ నల్ల కుబేరులకు ఐటీ శాఖ హెచ్చరికలు
న్యూఢిల్లీ: నల్ల కుబేరులు ఈ నెలాఖరులోగా స్వచ్ఛందంగా తమ దగ్గరున్న బ్లాక్‌మనీ వివరాలు వెల్లడించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని ఆదాయ పన్ను(ఐటీ) శాఖ హెచ్చరించింది. అక్రమ డిపాజిట్ల గురించిన సమాచారం అంతా తమ దగ్గరుందని పేర్కొంది. అక్రమ సంపద గురించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడి చేసేందుకు మార్చి 31తో ముగిసిపోనున్న ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై) పథకాన్ని వినియోగించుకోవాలని నల్లకుబేరులకు సూచించింది.
ఈ మేరకు ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలిచ్చింది. బ్లాక్‌మనీ హోల్డర్లపై చర్యలకు ‘కౌంట్‌డౌన్‘ మొదలైందని, ఇప్పుడైనా వివరాలు వెల్లడించని వారు తర్వాత బాధపడాల్సి వస్తుందని వాటిలో పేర్కొంది. ‘ఐటీ శాఖ వద్ద మీ డిపాజిట్ల పూర్తి సమాచారం ఉంది‘ అంటూ సాగే ఈ ప్రకటనలో.. అక్రమ సంపదను స్వచ్ఛందంగా వెల్లడించే వారి వివరాలు గోప్యంగా ఉంటాయని భరోసానిచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్లాక్‌మనీ వెల్లడి కోసం కేంద్రం పీఎంజీకేవై స్కీమ్‌ను గతేడాది డిసెంబర్ 17న ప్రవేశపెట్టింది.
బినామీ చట్టం కింద కూడా చర్యలు..
సందర్భాన్ని బట్టి డిఫాల్టర్లపై బినామీ లావాదేవీల నిరోధక చట్టం కూడా ప్రయోగించే అవకాశం ఉందని ఐటీ అధికారి ఒకరు చెప్పారు. పీఎంజీకేవై కింద స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించిన వారు సదరు ఆదాయంపై 49.9% పన్ను కడితే చాలన్నారు. ఒకవేళ పీఎంజీకేవైని ఎంచుకోకుండా ఆదాయ పన్ను రిటర్న్స్‌లో బ్లాక్‌మనీని చూపిన పక్షంలో పన్ను, దానికి అదనంగా 77.25% పెనాల్టీ కట్టాల్సి ఉంటుందన్నారు.
ఇక ఏ విధంగానూ తమ అక్రమ ఆదాయాన్ని చూపించకుండా ఊరుకుని, ఆ తర్వాత స్క్రూటినీ అసెస్‌మెంట్‌లో పట్టుబడితే పన్నుకు తోడు జరిమానా 83.25% ఉంటుంది. ఒకవేళ తనిఖీల్లో పట్టుబడి, ఆ మొత్తాన్ని సరెండర్ చేస్తే పన్ను, పెనాల్టీలు 107.25% మేర ఉంటాయి. సోదాల్లో కూడా తమ అక్రమ సంపదను సరెండర్ చేయని వారు అత్యధికంగా పన్నుకు తోడు 137.25% పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని చెప్పారు.. దీనికి తోడుగా బినామీ చట్టం కూడా ప్రయోగిస్తే... ఏడేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష , ఐటీ చట్టం కింద విచారణ, బినామీ ఆస్తుల మార్కెట్ రేటు ప్రకారం 25% దాకా పెనాల్టీతో పాటు ఇతరత్ర పెనాల్టీలు కూడా ఉంటాయి.