ఇప్పటివరకు ఎంత డబ్బు పట్టుబడిందో తెలుసా?
ఇప్పటివరకు ఎంత డబ్బు పట్టుబడిందో తెలుసా?
Published Wed, Dec 14 2016 3:56 PM | Last Updated on Wed, Oct 17 2018 4:10 PM
దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను శాఖ నిర్వహిస్తున్న దాడుల్లో కుప్పలు తెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు, భారీ మొత్తంలో బంగారం పట్టుబడుతున్నాయి. వీటిని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ సాగిస్తున్నారు. పాత నోట్ల రద్దు అనంతరం కర్ణాటక, గోవా ప్రాంతాల్లో ఐటీ డిపార్ట్మెంట్ జరిపిన దాడుల్లో పట్టుబడ్డ నగదు, బంగారం వివరాలను అధికారులు వెల్లడించారు. 2016 నవంబర్ 9 నుంచి కర్ణాటక, గోవా ప్రాంతాల్లో మొత్తం రూ.29.86 కోట్ల నగదు పట్టుబడినట్టు ఐటీ డిపార్ట్మెంట్ తెలిపింది. నగదుతో పాటు 41.6 కేజీల బంగారం, 14 కేజీల జువెల్లరీ అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వివరించారు. తాము స్వాధీనం చేసుకున్న ఈ నగదులో రూ.20.22 కోట్లు కొత్త రూ.2000 నోట్లేనని ఐటీ శాఖ వెల్లడించింది. అంతేకాక లెక్కలో చూపని నగదు 36 కేసుల్లో రూ.1000 కోట్లకు పైగా బయటపడినట్టు పేర్కొంది.
వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ డిపార్ట్మెంట్, పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో నేడు ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తుల నుంచి రూ.3.25 కోట్ల పాత నోట్లను పట్టుకున్నారు. రహస్య సమాచారంతో ఆదాయపు పన్ను శాఖతో కలిసి జరిపిన ఈ దాడిలో ఈ నగదు పట్టుబడినట్టు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు(క్రైమ్) రవింద్ర యాదవ్ పేర్కొన్నారు. అసోంలో 85 ఏళ్ల వృద్దుడైన వ్యాపారవేత్త హర్దీప్ సింగ్ బేదీ ఇంట్లో కూడా కోటిన్నర రూపాయల కొత్త నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 75వేల రూపాయలకు పైగా కొత్త రూ.500 నోట్లు, మిగిలినవి రూ.2వేల రూపాయల నోట్లు.
Advertisement
Advertisement