గే సెక్స్ పై ఆర్ఎస్ఎస్ యూటర్న్
న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ యూటర్న్ తీసుకుంది. సజాతీయుల సంబంధాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. గే సెక్స్ ను నేరంగా పరిగణించిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మాట మార్చింది. గే సెక్స్ నేరం కాదని, అనైతికమని, దానికి శిక్ష కంటే మానసిక చికిత్స అవసరమని పేర్కొంది.
'స్వలింగ సంపర్కం నేరం కాదు. సమాజంలో అదో అనైతికమైన పని. స్వలింగ సంపర్కానికి పాల్పడినవారిని శిక్షించాల్సిన అవసరం లేదు. మానసిక సంబంధమైన సమస్యగా గుర్తించి, వారికి చికిత్స అందించడం అవసర'మని ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హెసబాలె తన అభిప్రాయాన్ని శుక్రవారం ట్వీట్ చేశారు.
స్వలింగ సంపర్క దృక్పథాన్ని నేరంగా చూడకూడదని, వారిలో మార్పు తేవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తూ అమలవుతున్న ఐపీసీ సెక్షన్ 377ను రద్దు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.