సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. మోటారు వాహన చట్టం సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా మంగళవారం బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా భారత రోడ్డు రవాణా సంస్థల సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన విష యం తెలిసిందే. ఇందులో భాగంగా ఆగస్టు 7న సమ్మె చేస్తున్నట్లు యాజమాన్యానికి జూలై 24న గుర్తింపు యూనియన్ తెలంగాణæ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నోటీసులిచ్చింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ) తదితర 9 ఆర్టీసీ యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించాయి. అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించిన దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోనున్నాయి. లారీల సంఘాలు కూడా బంద్‌కు మద్దతునిచ్చాయి. ఆటోరిక్షాలు, క్యాబ్ సర్వీసులు కూడా బంద్‌లో పాల్గొనే అవకాశం ఉంది.
కోటిమందికి ఇబ్బందులు..
రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 97 లక్షల మందిని ఆర్టీసీ గమ్యస్థానాలకు చేరుస్తోంది. 24 గంటల సమ్మెకు అన్ని యూనియన్లు మద్దతు ప్రకటించిన దరిమిలా.. రాష్ట్రంలోని 98 డిపోల వద్ద నిరసన ప్రదర్శనలకు కార్మికులు సిద్ధమవుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్టీసీ ఇంతవరకూ ప్రకటన చేయలేదు. సమ్మె డిమాండ్లు రాష్ట్రం పరిధిలోనివి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ బిల్లు వల్ల ఆర్టీసీ కార్మికుల, సంస్థ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని రవాణామంత్రి మహేందర్‌రెడ్డి గతంలోనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రూ. 2,600 కోట్లు అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి నేటి సమ్మెతో మరోసారి నష్టం తప్పేలా లేదు.
డిమాండ్లు ఇవే!
కొత్త మోటారు వాహన సవరణ బిల్లు–2016 ప్రకారం.. ప్రైవేటు వారు ప్రయాణ మార్గాలను కొనుక్కోవచ్చు. అంటే లాభాలొచ్చే.. బిజీగా ఉండే.. రూట్లను ఏ ప్రైవేటు కంపెనీ వారు కొనుక్కున్నా ఆ మార్గంలో ఆర్టీసీ బస్సు కనిపించకూడదు. దీనిపై అన్ని ప్రభుత్వ రవాణా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే టోల్ గేట్ల నుంచి ఆర్టీసీకి మినహాయింపు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తగ్గింపు, కార్మికుల కనీస వేతనం రూ.24,000, డీజిల్‌పై అదనపు సుంకాలు తగ్గించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
‘గ్రేటర్’ రవాణా బంద్
గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ అనుబంధ రవాణా కార్మిక సంఘాలు, తెలంగాణ ఆటో డ్రైవర్‌ల సంక్షేమ సంఘం, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్, జై డ్రైవరన్న క్యాబ్స్ అసోసియేషన్ తదితర కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొననున్నాయి. దీంతో సుమారు 3,560 సిటీ బస్సులు, 1.4 లక్షల ఆటోరిక్షాలు, 2 లక్షల క్యాబ్‌లు, ట్యాక్సీలు నిలిచిపోనున్నాయి. స్కూలు బస్సులు, వ్యాన్‌లు, ఆటోరిక్షాలనూ నిలిపివేయనున్నట్లు వివిధ సంఘాల నేతలు ప్రకటించారు. దీంతో నగర వ్యాప్తంగా రవాణా స్తంభించనుంది. సుమారు 50 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురికానున్నాయి.
ఎంఎంటీఎస్, మెట్రో అదనపు సర్వీసులు
బంద్ వల్ల నగర ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు సర్వీసులు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టాయి. నాగోల్–సికింద్రాబాద్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడుపనున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా–సికింద్రాబాద్, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా తదితర మార్గాల్లో ప్రస్తుతం 121 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తుండగా.. ప్రయాణికుల రద్దీ మేరకు సర్వీసులు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
సమ్మెకు సహకరించండి
దేశంలోని అన్ని ఆర్టీసీల మనుగడకు మోటారు వాహన సవరణ బిల్లు–2016 ముప్పుగా మారింది. ఈ బిల్లు ఆర్టీసీ ఉనికికే ప్రమాదం. బిల్లు ఆమోదం పొందితే పేద విద్యార్థులకు రవాణా భారమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పడిపోతుంది. కాబట్టి కేంద్రం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. ఆటో, లారీలు, ఇతర రవాణా సంఘాలన్నీ మాతో కలసి రావాలని కోరుతున్నాం.
– అశ్వథ్థామరెడ్డి, టీఎంయూ అధ్యక్షుడు, థామస్‌రెడ్డి, టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment