గంట లేటుగా వచ్చామనడం అబద్ధం.. | Ashwathama Reddy Respond on Talks Between Government and TSRTC Unions Fail | Sakshi
Sakshi News home page

గంట ఆలస్యంగా వచ్చామనడం అబద్ధం..

Published Sun, Oct 27 2019 12:37 PM | Last Updated on Sun, Oct 27 2019 4:38 PM

Ashwathama Reddy Respond on Talks Between Government and TSRTC Unions Fail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సమ్మె వల్ల ఆర్టీసీ కుటుంబాలు పండుగలు జరుపుకోకపోవడం బాధాకరమని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ఆదివారం  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి జెండా ఆవిష్కరించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ ఇవాళ్టికి టీఎంయూ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. యూనియన్‌ను బలోపేతం చేయడానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. సమ్మెలో పుట్టిన టీఎంయూ యూనియన్‌ మళ్లీ సమ్మెలోనే ఎనిమిదో ఆవిర్భావాన్ని పూర్తి చేసుకోవడం దురదృష్టకరం. టీఎంయూ జెండా రంగు కూడా మార్చాం.

నిన్న చర్చలు నిర్బంధ కాండ మధ్య జరిగాయి. మేము గంట ఆలస్యంగా వచ్చామనడంలో వాస్తవం లేదు. ముందే చెప్పాం....మధ్యాహ్నం 2.15 గంటలకు వస్తామని. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులే ఆలస్యంగా వచ్చారు. అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తాం. 29న బహిరంగ సభ కోసం సన్నాహాలు చేస్తున్నాం. 30న జరిగే సకలజనుల సమరభేరీ విజయవంతం అవుతుంది. సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. సమ్మెకు మద్దతుగా ఎన్నారైల నుంచి పెద్ద ఎత్తున ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఎల్లుండి అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తాం.’ అని తెలిపారు. కాగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 23వ రోజు కూడా కొనసాగుతోంది.

చదవండి: లెక్క కుదర్లేదు ఆర్టీసీ చర్చలు విఫలం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement