సాక్షి, హైదరాబాద్ : తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ కార్మికులు చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆర్టీసీ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై ఆర్టీసీ డ్రైవర్ కూకట్‌పల్లి పోలీస్‌స్టేన్‌లో ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లికి డిపోకి చెందిన డ్రైవర్ రాజు తన ఫిర్యాదులో అనేక విషయాలు పేర్కొన్నాడు. అశ్వత్థామరెడ్డి విలీనం అనే విషాన్ని కార్మికుల్లో నింపారని, 22 రోజులుగా చేస్తున్న సమ్మె వల్ల పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని రాజు తెలిపాడు.
కాగా, ఆర్టీసీ డ్రైవర్ రాజు రాసిన లేఖలో సారాంశం ఈ విధంగా ఉంది. ' అయ్యా ! నా పేరు రాజు. నేను కూకట్‌పల్లి డిపో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. సార్ మా యూనియన్ లీడర్ అశ్వత్థామరెడ్డి కార్మికుల మనసులో విలీనం అనే విషాన్ని నింపారు. ఆయన మాటలు నమ్మి 22 రోజులుగా జరుగతున్న ఆర్టీసీ సమ్మెలో కొందరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ వీరి ఆత్మహత్యలకు అశ్వత్థామరెడ్డే ప్రధాన కారకుడు. ఇక ముందు ఇలాంటివి జరగకూడదనే అశ్వత్థామరెడ్డి పై ఫిర్యాదు చేశాను. అంతేగాక ఒకప్పుడు ఆర్టీసీకి పెద్దన్నలా వ్యవహరించిన హరీష్ రావును కొందరు పనికిమాలిన వాళ్లు ' మీరు మౌనంగా ఉండొద్దు, నోరు విప్పాలి అంటూ' ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.
అసలు సమ్మె విషయం హరీష్ రావుతో చర్చించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇప్పుడు చేస్తున్న సమ్మె వల్ల పోలీసుల సహాయం లేకుండా బస్సులు రోడ్డు మీదకు వెళ్లడం లేదు. మా చేతులతో మేమే ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెడుతున్నాం. గురువారం మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మె మాట పక్కనబెట్టి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇది నిజంగా మనకు గొప్ప అవకాశం. మన ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చే వరకు పరిస్థితిని తెచ్చుకోవద్దు. అశ్వత్థామరెడ్డి మీరు ఒక్కరే పీఎం, రాష్ట్రపతి వద్దకు వెళ్లి మా సమస్యలు పరిష్కరించండి. అంతేగానీ మా కార్మికుల పొట్ట గొట్టద్దు’ అని ఆ ఫిర్యాదులో వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment