న్యూఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్‌తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి హైకోర్టు విభజన సమస్య పరిష్కారంపై చర్చ జరిగింది. కాగా హైకోర్టు ప్రకటించిన ప్రాథమిక కేటాయింపుల జాబితాలో తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం జరిగిందంటూ న్యాయాధికారులు ఆందోళనకు దిగటం, వారిపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.
అలాగే కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, పలువురు పార్టీ లీగల్ సెల్ నేతలు హైకోర్టు విభజన, న్యాయాధికారుల అంశాలను మంగళవారం సదానంద దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విభజన అంశంపై సుప్రీంకోర్టు సీజేతో సదానంద గౌడ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు హైకోర్టు విభజన వివాదం, తాజా పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. హైకోర్టు విభజనపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని గతేడాది అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది.