
బాలిక హత్యపై స్పందించిన సాధ్వి నిరంజన్
లక్నో : సమాజంలో సంప్రదాయ విలువలు, సంస్కృతి మంటగలిశాయని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సాధ్వి నిరంజన్ జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. అలీగఢ్‌లో రెండేళ్ల చిన్నారిని చంపిన ఘటనను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని, కుటుంబ పెద్దలు తమ పిల్లల్లో మంచి విలువలు నెలకొల్పేలా చొరవ చూపాలని ఆకాక్షించారు. చిన్నారి మరణం దురదృష్టకరమని, ఈ తరహా ఘటనలపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం సత్వరమే స్పందిస్తోందని చెప్పారు.
తల్లిదండ్రులు అప్పు తీర్చలేదన్న కోపంతో వడ్డీ వ్యాపారి వారి రెండున్నరేళ్ల కూతురిని గొంతునులిమి చంపిన ఘటన అలీఘడ్‌లో కలకలం రేపిన సంగతి తెలిసిందే . ఆ వ్యాపారి చిన్నారి కను గుడ్లు బయటకు పీకేసి పాశవికంగా హత్యచేశాడు. బాలిక హత్యపై అలీగఢ్ జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. నిందితుడికి మరణ శిక్ష విధించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా నిందితుడి కుటుంబ సభ్యుల సహకారంతోనే ఈ దారుణం చోటుచేసుకున్నందున వారిని కూడా అరెస్ట్ చేయాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు.