ముంబయి: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇపుడు ఎక్కడ చూసినా ఈ విషయం గురించే తీవ్ర చర్చోపచర్చలు సాగుతున్నాయి. హిట్ అండ్ రన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ దబాంగ్ వీరుడికి శిక్షపడుతుందా? పడితే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది? అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ సందర్భంగా సల్మాన్ అభిమాన సోదరి అర్పిత ఈ సంక్షోభంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తన ట్టిట్టర్ ద్వారా సల్మాన్ అభిమానులకు, సన్నిహితులకు థ్యాంక్స్ చెబుతూ ఆమె ట్వీట్ చేశారు. ఎల్లవేళలా మీరు చూపిస్తున్న ప్రేమకు, ఆప్యాయతకు కృతజ్క్షతలు.. అంతే మంచే జరుగుతుందంటూ ఫ్యాన్స్కు అర్పితఖాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు 200 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టిన బాలీవుడ్ కూడా తీర్పుకోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. బాలీవుడ్ ప్రముఖ వర్గమంతా సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లి తమ సంఘీభావాన్ని తెలిపింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సల్మాన్ను పరామర్శించి దైర్యం చెప్పారు. అలాగే సల్మాన్ తండ్రి సలీం ఖాన్, సోదరి అర్పిత, ఆమె భర్త ఆయూష్ శర్మ మరో సోదరి అల్విరా.. ఆమె భర్త అతుల్ అగ్నిహోత్రి, సోదరుడు సోహెయిల్ కూడా సల్మాన్ పరామర్శించినవారిలో ఉన్నారు.
కాగా ఈరోజు తుదితీర్పు రానున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కలసి గత రాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేసిన సంగతి తెలిసిందే