తెలంగాణ అంశం మరోసారి లోక్‌సభలో నిరసనల పర్వానికి దారితీసింది. సోమవారం ఒకవైపు వర్షాకాల సమావేశాలు రెండోవారంలోకి ప్రవేశించగా.. మరోవైపు సమైక్యాంధ్ర, కేరళలో సోలార్ ప్యానెల్ కుంభకోణం అంశాలపై ప్రతిపక్షాలు సభను స్తంభింపజేశాయి.
కృష్ణుడి వేషధారణలో ఎంపీ శివప్రసాద్ నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అంశం మరోసారి లోక్‌సభలో నిరసనల పర్వానికి దారితీసింది. సోమవారం ఒకవైపు వర్షాకాల సమావేశాలు రెండోవారంలోకి ప్రవేశించగా.. మరోవైపు సమైక్యాంధ్ర, కేరళలో సోలార్ ప్యానెల్ కుంభకోణం అంశాలపై ప్రతిపక్షాలు సభను స్తంభింపజేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం, కిష్ట్వార్‌లో హింస అంశాలను కూడా బీజేపీ సభ్యులు సభలో ప్రస్తావించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ కృష్ణుడి వేషధారణలో వచ్చి సభలో నిరసన తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఇతర టీడీపీ ఎంపీలు ప్లకార్డులు, నినాదాలతో తమ ఆందోళన వ్యక్తపరిచారు. డిప్యూటీ స్పీకర్ కరియా ముండా దీనిపై అసహనం వ్యక్తంచేశారు. ‘‘ఈ రోజు సభలో పలువురు సభ్యుల వైఖరి సభా మర్యాదను పూర్తిగా మంటగలిపేలా ఉంది. కొందరు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేస్తే.. ఒక సభ్యుడైతే సభలో వేణువు వాయించడానికి యత్నించారు..’’ అని అసహనం వ్యక్తంచేశారు.
ఉదయం సభ ప్రారంభం కాగానే వామపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. సోలార్ ప్యానెల్ కుంభకోణం విషయంలో కేరళ సీఎం ఊమెన్ చాందీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలు కొనసాగడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. సభ పునఃప్రారంభమయ్యాక కూడా ప్రత్యేక బోడోలాండ్ కావాలంటూ కోక్రాజర్‌కు చెందిన ఓ ఎంపీ ప్లకార్డు ప్రదర్శించారు. ఈ గందరగోళంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం దేశ ఆర్థిక పరిస్థితిపై ఒక ప్రకటన చేశారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు.