బంధం బలోపేతం
భారత్-రష్యా మధ్య 20 కీలక ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్-రష్యా మధ్య బంధం మరింత బలోపేతమైంది. కీలక రంగాల్లో మరింత లోతుగా సహకరించుకోవాలని, దశాబ్దంలోగా ఇరు దేశాల మధ్య బంధాన్ని కొత్త శిఖరాలకు చేర్చాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మరో 20 ఏళ్లలో భారత్‌లో కనీసం 12 అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రష్యా అంగీకరించింది. అలాగే భారత్ కోసం అత్యాధునిక హెలికాప్టర్లను కూడా తయారు చేసివ్వనుంది. రక్షణ, చమురు, గ్యాస్, వైద్యం, గనులు, కమ్యూనికేషన్లు తదితర కీలక రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతమయ్యేలా 20 ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన వార్షిక సమావేశం సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలను కొత్త దశకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో అణు ఇంధన సహకారంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. ప్రస్తుతమున్నకుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి తోడు రష్యా సహకారంతో మరో కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేసేందుకు స్థల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ నిర్ణయించింది. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
భారత శక్తికి రష్యా మూలస్తంభం వంటిదని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారత వ్యూహాత్మక భాగస్వామిగా రష్యా పాత్ర మరింత పెరుగుతుందని ప్రధాని తెలిపారు. ‘కొత్త రక్షణ ప్రాజెక్టుల విషయంలో మేం విస్తృతంగా చర్చించాం. మేక్ ఇన్ ఇండియా వంటి దేశ ప్రాధాన్యాంశాలకు తోడ్పడే విధంగా రక్షణ సంబంధాలను కొనసాగించడంపై దృష్టి సారించాం. తన వద్దనున్న అత్యాధునిక హెలికాప్టర్‌ను ఇకపై పూర్తిగా భారత్‌లోనే తయారుచేసేందుకు రష్యా అంగీకరించింది. దీన్ని భారత్ ఎగుమతి కూడా చేయొచ్చు. ఇతర రక్షణ రంగ పరికరాలను భారత్‌లో తయారు చేసేందుకు రష్యా సుముఖంగా ఉంది’ అని మోదీ వెల్లడించారు. అలాగే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అణు రియాక్టర్ల నిర్మాణంపై కూడా దృష్టిసారించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన పరికరాలు, విడి భాగాల తయారీ కూడా భారత్‌లోనే జరుగుతుందని మోదీ పేర్కొన్నారు. అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటును వేగవంతం చేయాలని అణు సహకారంపై సంయుక్తంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించుకున్నట్లు తెలిపారు. చమురు, సహజవాయువు రంగాల్లోనూ పరస్పరం సహకరించుకునేలా ఎజెండాను రూపొందించుకోనున్నట్లు చెప్పారు.
ఇరు దేశాల కరెన్సీలతోనే వాణిజ్యం
ఆర్థిక రంగంలో మరింత సహకారానికి కృషి చేయాలని, వాణిజ్య చెల్లింపులను ఇరుదేశాల కరెన్సీలోనే జరుపుకొనేలా ప్రోత్సహించాలని భారత్-రష్యా అంగీకారానికి వచ్చాయి. ఇందుకోసం ఎదురయ్యే అడ్డంకులు, సమస్యల పరిష్కారానికి సిఫారసులు చేసేందుకుగాను ఓ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాయి. ఇంధన రంగంతో పాటు పెట్రో కెమికల్స్‌లోనూ సంయుక్త ప్రాజెక్టులను చేపట్టాలని, టెక్నాలజీ ఆధారిత ప్రాజెక్టుల విషయంలో సంయుక్తంగా డిజైన్, అభివృద్ధి, తయారీని చేపట్టాలని నిర్ణయించాయి. అంతరిక్షం, వైమానిక రంగం, ఖనిజాభివృద్ధి తదితర రంగాలకూ దీన్ని విస్తరించాలని అంగీకారానికి వచ్చాయి. ఎరువులు, వజ్రాల వ్యాపారం, ఫార్మా, ఐటీ, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు వంటి అంశాలపైనా దృష్టి సారించాలని ఇరుదేశాధినేతలు నిర్ణయించారు.
ఉగ్రవాదానికి తావు లేకుండా చేస్తాం
జమ్మూతోపాటు చెచెన్యాలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన వారికి భారత్-రష్యా సంతాపం ప్రకటించాయి. ఈమేరకు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఉపఖండంలోని ఉగ్రవాద స్థావరాలను దశాబ్దంలోగా నామరూపాల్లేకుండా చేస్తామని అందులో పేర్కొన్నాయి. పొరుగు దేశాల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి అంతర్జాతీయంగా విస్తరిస్తున్న ఉగ్రవాదాన్ని అరికట్టడానికి దేశాల మధ్య మరింత సహకారం అవసరమని అభిప్రాయపడ్డాయి. భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరికొత్తగా తీర్చిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాయి.
ఒప్పందాలు ఇవే..
హైడ్రోకార్బన్ల ఉత్పత్తిలో సంయుక్త పరిశోధన, రష్యా నుంచి భారత్‌కు హైడ్రోకార్బన్ల సరఫరా కోసం పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం, దీర్ఘకాలిక ఎల్‌ఎన్‌జీ సరఫరా, పదేళ్ల పాటు ముడిచమురు సరఫరా, రష్యాలో పెట్టుబడులకు అవకాశాలను సంయుక్తంగా గుర్తించడం, రష్యా ఎరువుల కంపెనీ ‘ఆక్రాన్’ను దాదాపు రూ. 12 వేల కోట్లకు భారత కంపెనీల కన్సార్షియం చేపట్టడం, కుడంకుళం అణు కేంద్రంలో మూడు, నాలుగో యూనిట్‌ను నెలకొల్పడం వంటి ఒప్పందాలను ఇరుదేశాలకు సంబంధించిన సంస్థలు తాజా వార్షిక సదస్సు సందర్భంగా కుదుర్చుకున్నాయి. అలాగే వార్తల పరస్పర మార్పిడికి వీలుగా రష్యన్ న్యూస్ ఏజెన్సీతో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) ఒప్పందం కుదుర్చుకుంది. వీసా నిబంధనల సరళీకరణకు కూడా ఇరు దేశాలు అంగీకరించాయి.