మీరట్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్రమంత్రి సంజీవ్ బల్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థులకు అన్ని వర్సిటీల్లో 10 శాతం సీట్లు కేటాయించారంటే ఆందోళనలు చల్లారుతాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం మీరట్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు మద్దతుగా బీజేపీ చేపట్టిన ర్యాలీలో సంజీవ్ బల్యాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ‘రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఓ విన్నపం. సీఏఏ ఆందోళనలు సద్దుమణగాలంటే ఒకే ఒక పరిష్కారం. పశ్చిమ యూపీకి చెందిన విద్యార్థులకు అన్ని యూనివర్సిటీల్లో 10 శాతం కోటా కల్పిస్తే చాలు. ముఖ్యంగా జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆందోళనలు సద్దుమణుగుతాయి. అంతకుమించి మరేమీ అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇక కేంద్రమంత్రి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆయనపై విరుచుకుపడుతున్నాయి.
దేశవ్యాప్తంగా నిరసనలు
కాగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన నాటినుంచి వేలాది విద్యార్థులు దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అది చట్ట రూపం దాల్చిన అనంతరం సీఏఏ వ్యతిరేక ఆందోళనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో పోలీసులు విద్యార్థులపై లాఠీ ఝుళిపించగా.. జేఎన్‌యూలో ముసుగు వేసుకున్న కొంతమంది దుండగులు యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులపై దాడికి దిగారు. అనంతరం ఈ దాడులపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కాగా మంత్రి సంజీవ్ బల్యాన్ 2013 ముజఫర్‌నగర్ దాడుల్లో నిందితుడిగా ఉన్నారు. ఈ దాడుల్లో 60 మంది చనిపోగా వేలాదిమంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే.
చదవండి: వెనక్కి తగ్గని ‘షహీన్‌బాగ్’
Comments
Please login to add a commentAdd a comment