
చెక్ ప్రదానం చేసిన మహిళా సర్పంచ్
భువనేశ్వర్ : ప్రాణాల్ని పణంగా పెట్టి కంటి మీద కునుకు లేకుండా సరిహద్దు ప్రాంతాల్లో దేశ ప్రజల రక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రక్షణ దళంపట్ల ఓ పంచాయతీ సర్పంచ్ దృష్టి సారించారు. ఆమెకు లభిస్తున్న గౌరవ వేతనాన్ని దేశ రక్షణ వ్యవహారాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. లాంచనంగా ప్రతి నెల రూ.1 గౌరవ వేతనంగా స్వీకరించి మిగిలిన సొమ్మును దేశ రక్షణకు అంకితం చేసేందుకు నిర్ణయించినట్లు బుధవారం ప్రకటించారు.
ఈ మహత్తర నిర్ణయం తీసుకున్న సర్పంచ్ మహిళ కావడం మరో విశేషం. ఆమె పదవీకాలంలో కొనసాగినంత కాలం తనకు లభించే గౌరవ వేతనంలో రూ.1 మినహా మిగిలిన మొత్తం దేశ రక్షణ కోసం అంకితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 72వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని భద్రక్ జిల్లా తిహిడి సమితి మహారామ్‌పూర్ పంచాయతీ మహిళా సర్పంచ్ అలైలాప్రభ రౌల్ దేశ రక్షణ కోసం తన గౌరవ వేతనం అంకితం చేసినట్లు ప్రకటించారు.
స్థానిక సమితి కార్యాలయం ప్రాంగణంలో జాతీయ పతాకం ఆవిష్కరణకు విచ్చేసిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. తన విరాళం మొత్తాన్ని చెక్ రూపంలో సమితి అభివృద్ధి అధికారికి అందజేశారు. ఈ విధానం తాను పదవిలో కొనసాగినంత కాలం నిరవధికంగా కొనసాగుతుందని ఆమె ప్రజల సమక్షంలో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment