సాక్షి,చెన్నై: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తన భర్తను చూసేందుకు 15 రోజుల పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఏఐఏడీఎంకే నేత టీటీవీ దినకరన్ చెప్పారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శశికళ భర్త ఎం నటరాజన్ చికిత్స పొందుతున్న విషయం విదితమే. లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. కాగా, శశికళకు పెరోల్ మంజూరవుతుందని దినకరన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్‌పై వ్యాఖ్యానించేందుకు దినకరన్ నిరాకరించారు. దీనిపై తాము సీబీఐ విచారణను కోరుతున్నామని చెప్పారు. పళనిస్వామి ప్రభుత్వం త్వరలోనే ఇంటిదారి పడుతుందని వ్యాఖ్యానించారు.