చిన్నమ్మే చీఫ్ మినిస్టర్
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవ ఎన్నిక
- పేరును ప్రతిపాదించిన పన్నీరు సెల్వం
- జైకొట్టిన ఎమ్మెల్యేలు
- 9న సీఎంగా చిన్నమ్మ ప్రమాణ స్వీకారం
- ముఖ్యమంత్రి పదవికి పన్నీరు రాజీనామా
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారాయి. ఊహించినట్టుగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించేందుకు మార్గం సుగమమైంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన అత్యవసర సమావేశంలో 136 మంది ఎమ్మెల్యేలు శశికళను తమ నేతగా ఎన్నుకున్నారు. శశికళను పార్టీ శాసనసభాపక్ష నేతగా ప్రతిపాదిస్తూ స్వయంగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అందరూ హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. ఈనెల 9వ తేదీన సీఎంగా చిన్నమ్మ ప్రమాణస్వీకారం చేయనున్నారు. శాసనసభాపక్ష నేతగా ఎంపికైన అనంతరం పార్టీ సభ్యులనుద్దేశించి 60 ఏళ్ల శశికళ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం, ‘అమ్మ’ ఆశయసాధన కోసం తాను సీఎం పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.
శరవేగంగా మారిన పరిణామాలు...
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత గతేడాది డిసెంబర్ 5న కన్నుమూయడంతో ఆమె నిర్వర్తిస్తున్న రెండు బాధ్యతలను పన్నీర్‌సెల్వం, శశికళలు పంచుకోవడం తెలిసిందే. అయితే పార్టీ సంప్రదాయం ప్రకారం రెండు పదవుల్లో ఒక్కరే ఉన్నప్పుడే పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం సాధ్యమని శశికళ విధేయులైన కొందరు మంత్రులు, సీనియర్ నేతలు వాదన లేవనెత్తారు. ఇది కాలక్రమేణా బలపడుతూ రాగా మరోవైపు పన్నీర్‌సెల్వం తన పని తాను చేసుకుంటూ పోతూనే పదవిని కాపాడుకునే ప్రయత్నం చేయసాగారు. దీంతో అప్రమత్తమైన శశికళ శరవేగంగా పావులు కదిపారు.
ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలంతా ఆదివారం నాటి అత్యవసర సమావేశానికి హాజరుకావాలంటూ పోయెస్‌గార్డెన్ నుంచి టెలిఫోన్‌ద్వారా శనివారం ఆదేశాలు పంపారు. దీంతో పన్నీర్‌సెల్వంకు ఉద్వాసన ఖాయమని శనివారంరాత్రే తేలిపోయింది. చెన్నై సమీపంలోని సముద్రతీరంలో రెండు నౌకలు ఢీకొనగా వెలువడిన చమురుతెట్టు తొలగింపు పనులను పర్యవేక్షించేందుకు సీఎం పన్నీర్‌సెల్వం ఆదివారం ఉదయాన్నే ఎన్నూరు హార్బర్‌కు వెళ్లారు. అక్కడినుంచి సచివాలయానికొచ్చి అధికారులతో సమావేశం జరుపుతుండగా పోయెస్‌గార్డెన్ నుంచి పిలుపొచ్చింది. దీంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ఆపేసి 11.45 గంటలకు హడావుడిగా శశికళ వద్దకు చేరుకున్నారు. ఆమెతో రెండు గంటలపాటు మంతనాలు జరిపారు.
శశికళ పేరును ప్రతిపాదించిన పన్నీరుసెల్వం
అనంతరం మధ్యాహ్నం 2గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. శాసనసభాపక్ష నేతగా తాను రాజీనామా చేస్తున్నట్లు సీఎం పన్నీర్‌సెల్వం ప్రకటించడంతోపాటు ఆ స్థానానికి శశికళను ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. సీఎంసహా సమావేశానికి హాజరైన 136 మంది ఎమ్మెల్యేలు శశికళను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఎంపిక అనంతరం శశికళ మాట్లాడుతూ ఆనాడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, నేడు శాసనసభాపక్ష నేతగా తనను ముందుగా ప్రతిపాదించింది పన్నీర్‌సెల్వమేనన్నారు. పార్టీ కష్టకాలాలను ఎదుర్కొన్న సమయాల్లో, గతంలో సీఎంగా అమ్మ కొనసాగడానికి ఇబ్బంది ఎదురైన సమయాల్లోను పన్నీర్‌సెల్వం అండగా నిలిచారని ప్రశంసించారు.
జయలలిత మరణాంతరం తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సీఎంగా బాధ్యతలు చేపట్టాలని తొలుత పన్నీరుసెల్వమే కోరారని, అయితే అప్పట్లో అమ్మను కోల్పోయిన బాధలో ఏదీ వినే పరిస్థితిలో తాను లేకపోయానని చెప్పారు. అయితే రెండు పదవుల్ని ఒక్కరే నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి పదేపదే వస్తున్న వినతులతో ఇందుకు ఆమోదిస్తున్నానని తెలిపారు. తమిళనాడు ప్రజల సంక్షేమంకోసం అన్నాడీఎంకే తన కృషిని కొనసాగిస్తుందన్నారు. గతేడాది డిసెంబర్ 31న పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన శశికళ నెల రోజులు తిరిగేసరికల్లా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడం విశేషం. జయలలిత మరణించిన తరువాత సరిగ్గా 60 రోజులకు చిన్నమ్మ సీఎంగా మారనున్నారు. శశికళ శాసనసభాపక్ష నేతగా ఎంపికవడంతో ఆమె మద్దతుదారులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
విధేయతకు మారుపేరు ‘పన్నీరు’
విధేయుడంటే ఇలాఉండాలని పన్నీరు సెల్వం మరోమారు చూపారు. అమ్మ జయలలితకే కాదు, చిన్నమ్మ శశికళకూ తాను విధేయుడేనని చాటుకున్నారు. పదవులు తనకు శాశ్వతం కాదన్నట్టు, విధేయతే ముఖ్యమని మరోమారు చాటుకున్నారు. జయలలితకు అత్యంత నమ్మినబంటుల్లో ఆ పార్టీ కోశాధికారి ఓ పన్నీరుసెల్వం ఒకరు. అమ్మ సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నప్పుడల్లా, ఆమెకే కాదు.. తమిళనాడుకు ఆపద్భాందవుడిగా సీఎం పగ్గాలు చేపట్టారు. తేని జిల్లా పెరియకులం గ్రామంలో పుట్టి పెరిగి, టీ దుకాణం నడుపుకుంటూ రాజకీయాల్లో పన్నీరు సెల్వం అడుగిడారు.
పెరియకులం మున్సిపల్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన ఆయన జయలలితకు అత్యంత విధేయుడిగా అవతరించారు. 2001ఎన్నికలతో తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టగానే, కేబినెట్ పదవి దక్కించుకున్నారు. అదేఏడాది టాన్సీభూముల కేసులో జయలలిత జైలుశిక్షను ఎదుర్కొనడంతో, సీఎం పదవి చేపట్టే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఆ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి 2002 మార్చి 1 వరకు ఐదున్నర నెలలు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో అక్రమాస్తుల కేసులో జయలలిత మళ్లీ జైలుశిక్ష ఎదుర్కోవాల్సి రావడంతో రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఆ ఏడాది సెప్టెంబర్ 29 నుంచి 2015 మే 22 వరకు 8 నెలలు పనిచేశారు. ఇక గత డిసెంబర్ 5న జయలలిత మరణం అనంతరం మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు చిన్నమ్మ శశికళకు పగ్గాలప్పగిస్తూ విధేయత చాటుకున్నారు.
ప్రజలు కోరుకున్న సీఎంలు కారు
– శశికళ ఎంపికపై ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్య
‘‘పోయెస్‌గార్డెన్ ఇంట్లో నివసించేవారిని ప్రజలు సీఎంగా ఆశించి ఓటు వేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కాదు’’అని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళను ఎన్నుకోవడంపై ఆయన స్పందిస్తూ.. గతేడాది జరిగిన ఎన్నికల్లో సీఎంగా జయలలిత ఉండాలని ఆశించి ప్రజలు ఓట్లేశారని, ఆమె మరణం తరువాత నిన్నటివరకు పన్నీర్‌సెల్వం, ఆ తరువాత శశికళ ప్రజలు కోరుకున్న ముఖ్యమంత్రులు కారని వ్యాఖ్యానించారు.
శశికళకు పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఏనాడూ జయలలిత కనీస ప్రాధాన్యమివ్వలేదని, జైలు కెళ్లినప్పుడు సైతం పన్నీర్‌సెల్వంకే బాధ్యతలు అప్పగించారని అన్నారు. అయితే ఈరోజు శశికళను సీఎంగా చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం జయలలిత మనోభీష్టానికి, ప్రజాభిప్రాయానికి విరుద్ధమని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని చెప్పారు.
తమిళనాడు చరిత్రలో బ్లాక్‌డే: ఈవీకేఎస్ ఇళంగోవన్
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఎంపిక తమిళనాడు రాజకీయాల్లో బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ(టీఎన్‌సీసీ) మాజీ అ«ధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. శశికళ ప్రజల నుంచి రాలేదు, ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమెకు డిపాజిట్టూ దక్కదన్నారు. శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే స్వేచ్ఛ ఆ పార్టీ ఎమ్మెల్యేలకుందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ సమర్థించారు.
అంత అవసరం ఏమిటి: బీజేపీ
అన్నాడీఎంకేలో చోటుచేసుకుంటున్న పరిణామాలను అంతర్గత వ్యవహారంగా పరిగణించడానికి వీలులేదని బీజేపీ తమిళనాడుశాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కేవలం రెండు నెలల్లో పన్నీర్‌సెల్వంను సీఎం పదవి నుంచి తప్పించాల్సిన అవసరమేంటో ప్రజలకు చెప్పాలన్నారు.
దురదృష్టకరం: జయలలిత మేనకోడలు దీప
సీఎంగా పన్నీర్‌సెల్వంను తప్పించి శశికళ బాధ్యతలు తీసుకోవడం దురదృష్టకరమని జయలలిత మేనకోడలు దీప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నకోబడని శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖండించదగిన అంశమన్నారు. ప్రజాస్వామ్య పాలనను కాదని అకస్మాత్తుగా సైనిక పరిపాలన వచ్చినట్లు భావిస్తున్నానని చెప్పారు.