న్యూఢిల్లీ: పనామా పేపర్ల కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం ఇప్పటివరకు రూపొందించిన ఆరు నివేదికలను తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని మంగళవారం ఆదేశించింది. ఇందుకోసం నాలుగు వారాల గడువు ఇస్తూ నివేదికలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలంది.
జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ ఎంఎం శంతనగౌడార్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. గతంలో కేసును దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ), భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ), ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లలోని విచారణ అధికారులు సభ్యులుగా ఒక బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ బృందం విచారణ జరపడం లేదని కోర్టులో ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఆరోపించగా..విచారణ జరుగుతోందనీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తెలిపారు.