హెచ్ఐవి పాజిటివ్ అని గెంటేశారు
కోలకత్తా: హెచ్ఐవి పాజిటివ్ అని తేలిన ఓ చిన్నారిని స్కూలు నుంచి గెంటేసిన వైనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. ఓ వైపు ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంటే, మరోవైపు ప్రభుత్వ పాఠశాల ఇంత అమానుషంగా ప్రవర్తించడం వివాదాన్ని రేపింది.
రాష్ట్ర రాజధాని నగరం కోలకతాకు కూతవేటు దూరంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూలు నుంచి గెంటేశారు. కాగా ఆ విద్యార్థి తల్లి ....తనకు, తన కుమారుడికి వ్యాధి ఉన్న సంగతిని ముందే స్కూలు యాజమాన్యానికి తెలిపింది. తాను ఎయిడ్స్ వ్యాధి అవగాహన సంస్థలో పనిచేస్తున్నాననే సమాచారాన్ని కూడా ఇచ్చింది. అయితే ముందు ఎలాంటి అభ్యంతరం చెప్పని యాజమాన్యం, తరువాత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి, పిల్లవాడిని క్లాసులకు రావద్దంటూ ఆదేశించింది.
తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు... బాధిత విద్యార్థిని అందరూ చూస్తుండగానే రకరకాలు వ్యాఖ్యలు చేస్తున్నా స్కూల్ యాజమాన్యం ఏమాత్రం అడ్డుకోలేదు. దీనికితోడు మళ్లీ స్కూలు రావద్దంటూ ఆచిన్నారిని ఆదేశించి దారుణంగా అవమానించింది. విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తన చర్యను యాజమాన్యం సమర్ధించుకుంది. దీనిపై విద్యార్థి తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. పిల్లల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ అధికారులు అమానుషంగా ప్రవర్తించడాన్ని తప్పు బట్టింది.