డేరా సచ్ఛా సౌదాలో సెర్చ్ ఆపరేషన్
డేరా సచ్ఛా సౌదాలో సెర్చ్ ఆపరేషన్
Published Fri, Sep 8 2017 7:57 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM
సాక్షి, సిర్సా: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తుండగా, అతని అక్రమాలకు సంబంధించి రోజుకు కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిందంటూ ఓ పిటిషన్ దాఖలు కావటంతో ఛండీగఢ్ హైకోర్టు హర్యానా ప్రభుత్వాన్ని సోదాలకు ఆదేశించింది. దీంతో శుక్రవారం సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు సోదాలు చేపడుతున్నాయి.
ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలుకాగా సుమారు 41 పారామిలిటరీ కంపెనీలు, నాలుగు ఆర్మీ దళాలు, నాలుగు జిల్లాల పోలీసులు, ఒక స్వాట్ టీం, ఒక డాగ స్క్వాడ్ పాల్గొంటున్నాయి. ఉన్నతాధికారులు నేతృత్వంలో ఓవైపు డేరాను మొత్తం జల్లెడ పడుతున్నారు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కర్ఫ్యూ కొనసాగుతుండగా.. నేటి సోదాలతో చుట్టుపక్కల జనాలు ఆందోళన వ్యక్తం చేస‍్తున్నారు.
మరోవైపు డేరా అనుచరులు అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అస్తి పంజరాలు బయటపడ్డాయన్న విషయాన్ని డేరా వర్గాలు కూడా ధృవీకరించటంతో ఎలాంటి విషయాలు బయటపడతాయోనని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Advertisement