ఆపరేషన్ క్లీన్ మనీ – 2
► 60 వేల మందికి నోటీసులు
► నల్లధన అక్రమార్కులపై ఐటీ కొరడా
న్యూఢిల్లీ: నల్లధన అక్రమార్కులపై ఐటీ శాఖ విరుచుకుపడుతోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరిట రెండో దశ చర్యలకు శుక్రవారం శ్రీకారం చుట్టింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో 1,300 మంది అత్యంత అనుమానిత వ్యక్తులతో సహా 60 వేల మందికి పైగా వ్యక్తులు, సంస్థలు భారీగా నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. వీరికి ఆన్‌లైన్‌లో నోటీసులు పంపనున్నారు.
అత్యధిక నగదు డిపాజిట్లు చేసిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, విలువైన ఆస్తులను కొనుగోలు చేసిన వ్యక్తులు, సంస్థలపై విచారణ చేపడతామన్నారు. ఆపరేషన్ తొలిదశలో స్పందించని వారిపైనా విచారణ ఉంటుందన్నారు. అనుమానితులెవ్వరినీ తాజా ఆపరేషన్‌లో వదలమని స్పష్టం చేశారు. నోట్ల రద్దు ప్రకటన తర్వాత అంటే 2016, నవంబర్ 9 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ. 9,334 కోట్లకు పైగా నల్లధనాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ మనీ తొలి దశలో ఐదు లక్షలకు పైగా డిపాజిట్లు చేసిన 17 లక్షలకు పైగా అనుమానిత ఖాతాదారులకు ఐటీ శాఖ ఎస్సెమ్మెస్ – ఈ మెయిల్స్ ను పంపించింది.
బెంగళూరులో 15 కోట్ల పాత కరెన్సీ
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ఓ మాజీ కార్పొరేటర్ ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించగా రూ. 14.80 కోట్ల పాత కరెన్సీ లభ్యమైంది. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. నాగరాజు అలియాస్ బాంబ్‌నాగ బెంగళూరులోని శ్రీరాంపురలో మూడంతస్తుల ఇంట్లో ఉంటున్నాడు.
కిడ్నాప్, బెదిరింపుల కేసు విషయమై ఇతనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా నోట్ల వ్యవహారం బయటపడింది. బాంబ్‌నాగ ఇంటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేయగా పాత రూ. 500, రూ. 1,000 నోట్లు బయటపడ్డాయి. 10 బాక్సులు, 3 బ్యాగుల్లో నోట్ల కట్టలు పేర్చి వాటిపై పరువును ఉంచారు. నోట్లు లెక్కించే యంత్రాలను తెప్పించి శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దు పోయే వరకూ లెక్కించారు.