సంయుక్త ఉద్యమ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు పూర్తి మద్దతు ఉంటుందని సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు హామీ ఇచ్చారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ‘‘రాజీనామాలతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే పార్టీకి, ప్రభుత్వ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటే సీమాంధ్రుల మనోభావాలను కేంద్రానికి వెల్లడించడం కష్టమవుతుందన్నారు. కాబట్టి మరికొంత సమయం వేచిచూద్దామన్నారు’’ అని వెల్లడించారు.
ఉద్యమంలో రాజకీయ నేతలు, ఉద్యమ శక్తులు కలిసి పని చేసేందుకు వీలుగా కమిటీ ఏర్పాటు చేద్దామని మంత్రులు ప్రతిపాదించగా అంగీకారం తెలిపామన్నారు. త్వరలోనే ఇరు పక్షాలతో కమిటీ వేసి భావి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. తమ ఉద్యమంలో మంత్రులు కలిసి వస్తామని చెప్పడం శుభపరిణామమని, దీన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. గురువారం మధ్యాహ్నం పార్లమెంటు హాల్లో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతో ఏపీ ఎన్జీవోలు సమావేశమయ్యారు. పలు అంశాలపై మూడు గంటల పాటు చర్చించారు.
ఆ వెంటనే వారంతా మరోమారు ఏపీభవన్‌లోనూ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కేవీపీ రామచంద్రరావు పాల్గొన్న ఈ భేటీలోనూ మంత్రులు, ఎంపీల రాజీనామాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. అనంతరం అశోక్‌బాబు మీడియాతో మాట్లాడారు. ‘‘సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని మేమంతా గట్టిగా డిమాండ్ చేశాం. రాజీనామాలు చేయనంత మాత్రాన తమకు ఒరిగేదేమీ లేదని మంత్రలు, ఎంపీలు అన్నారు. ఆరు నెలల్లో పోయే పదవుల కోసం పాకులాడబోమని, ఉద్యమాన్ని ఉద్యోగులు ముందుకు తీసుకెళ్తామంటే రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం అవుతుందంటే ఇప్పుడే రాజీనామాలు ఇస్తామన్నారు.
కానీ అలా చేస్తే సీమాంధ్రలో ఉద్యమ పరిస్థితిని, వాస్తవాలను కేంద్రానికి చెప్పే వీలుండదని చెప్పారు. ఉద్యమ స్వరూపాన్ని వివరించి, విభజన నిర్ణయాన్ని రద్దు చేయించేందుకు కృషి చేస్తున్నామన్నారు’’ అని ఆయన వివరించారు. ‘రాజకీయ నాయకులు, ఉద్యమ శక్తులు కలిసి నడుద్దాం. ప్రజాప్రతినిధుల తరఫున ఇద్దరు, ఉద్యోగుల నుంచి కొందరితో కమిటీ వేసుకుని ముందుకెళ్దాం’ అని సూచించారన్నారు. ఆ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఇరుపక్షాల నేతలతో కలిసి కమిటీ వేసి కార్యాచరణపై చర్చించుకుంటామన్నారు. ఉద్యోగ సంఘాలు ఆంటోనీ కమిటీ ముందుకు వెళ్లడంపై చర్చ జరిగిందని, కానీ అందుకు తాము అంగీకరించలేదని అన్నారు.
హైదరాబాద్ సభకు మంత్రుల మద్దతు
సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు మంత్రులు, ఎంపీలు మద్దతిస్తామన్నారని అశోక్‌బాబు తెలిపారు. వీలును బట్టి అందులో పాల్గొనేందుకు కూడా సిద్ధమని వారు చెప్పారని, తమ హాజరుపై రాజకీయ దుమారం రేగుతుందనుకుంటే తమ ప్రతినిధులను పంపుతామన్నారని చెప్పారు. ‘సభ నిర్వహణలో ఏర్పడుతున్న అడ్డం కులను వారి దృష్టికి తీసుకెళ్లాం. అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి అనుమతి ఇప్పిస్తామని వారు చెప్పారు’ అన్నారు.
వెనక్కు రాకున్నా ముందుకు పోదు
ప్రస్తుత ఢిల్లీ పరిస్థితులు, పార్టీల అభిప్రాయాలను చూస్తుంటే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై యూపీఏ ప్రభుత్వం వెనక్కు వెళ్లలేకున్నా ప్రక్రియను మాత్రం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదని స్పష్టమైందని అశోక్‌బాబు అన్నారు. ‘‘విభజనతో సీమాంధ్రలో తలెత్తే పలు అంశాలను కేంద్రం విస్మరించిందని, వాటికి పరిష్కారం చూపకపోవడం సరికాదని బీజేపీ, అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, జేడీ(యూ) అభిప్రాయపడ్డాయి’’ అన్నా రు. విభజన సమస్యలకు పరిష్కారం చూపకుండా కేంద్రం తెలంగాణ ప్రక్రియపై ఒక్క అడుగూ ముందుకు వేయలేదన్న నమ్మకం తమకు కలిగిందన్నారు.