చికెన్ కిలో రూ.87కే అమ్మండి: మంత్రి
తిరువనంతపురం: వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమలు అవుతున్న నేపథ్యంలో కిలో చికెన్ రూ.87/-కే అమ్మాలని కేరళ ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఐసాక్ పౌల్ట్రీ వ్యాపారులను కోరారు. లేకుండే చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఎస్‌టీ పన్ను రేట్లలో చికెన్ జీరో ట్యాక్స్ కిందకు వస్తుంది. జీఎస్‌టీ అమలు కాకముందు 14.5 శాతం పన్నును చికెన్‌పై కేరళ రాష్ట్రం వసూలు చేసేది.
జీఎస్టీ అమలు తర్వాత చికెన్ ధరలు గణనీయంగా తగ్గించాల్సివున్నా పౌల్ట్రీ వ్యాపారులు మాత్రం పాత ధరలతోనే అమ్మకాలు జరుపుతున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన ఆర్థిక శాఖ మంత్రి థామస్ ఐసాక్.. వ్యాపారులకు గట్టి హెచ్చరికలు చేశారు. ఇదిలావుండగా.. చికెన్ కిలో రూ.87/-కు అమ్మడం అసాధ్యమని పౌల్ట్రీ వ్యాపారులు వ్యాఖ్యానించారు.
పౌల్ట్రీ ఫారంల నుంచి చికెన్ కొనుగోలు రూ.115/- ఉంటోందని.. దాన్ని రీటైల్‌లో రూ.125/-కు అమ్ముతున్నామని చెప్పారు. చిన్నాచితకా వ్యాపారులు దాన్ని కిలో రూ.142/-కు అమ్ముతున్నారని వివరించారు. ఫారంలు కోళ్ల ధరలు తగ్గిస్తే రూ.87/-కే కిలో చికెన్ అమ్ముతామని చెప్పారు. చికెన్ ధర పెరుగుదలకు కారణం జీఎస్‌టీ కాదని తమిళనాడు నుంచి రాష్ట్రానికి వచ్చే చికెన్ దిగుమతి తక్కువకావడమేనని మరో వ్యాపారి పేర్కొన్నారు.