సేవలపై 18% పన్ను! | Service Tax Rate To Rise From 15% To 18% Under GST | Sakshi
Sakshi News home page

సేవలపై 18% పన్ను!

Published Fri, Apr 14 2017 1:09 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

సేవలపై 18% పన్ను!

సేవలపై 18% పన్ను!

► జీఎస్టీ మండలికి నివేదిస్తాం
► రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా వెల్లడి


న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమల్లో భాగంగా సేవలపై గరిష్టంగా 18 శాతం పన్ను వసూలు చేయవచ్చని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా తెలిపారు. ఈ ప్రతిపాదనను జీఎస్టీ మండలికి నివేదిస్తామని, సమీక్ష అనంతరం సేవా పన్ను రేట్లపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. 18శాతం ప్రతిపాదనకు జీఎస్టీ మండలి అంగీకరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సేవా రంగంపై గరిష్టంగా 14 శాతం పన్ను విధిస్తుండగా.. అర శాతం చొప్పున స్వచ్ఛ భారత్, క్రిషి కల్యాణ్‌ పన్నుల్ని వసూలు చేస్తున్నారు.

ప్రస్తుత గరిష్ట పన్ను 15 శాతాన్ని 18 శాతానికి పెంచితే కొన్ని సేవల ధరలు పెరగవచ్చు. జీఎస్టీకి ముందు కొనసాగినట్లే వైద్య, విద్య, వ్యవసాయ రంగాల్ని సేవా పన్ను పరిధి నుంచి మినహాయించవచ్చని అధియా పేర్కొన్నారు. ప్రస్తుతం మినహాయింపు జాబితాలో ఉన్న సేవలపై ఎలాంటి పన్ను లేకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. విద్య, వైద్యం, మతపరమైన తీర్థయాత్రలు వంటి 60 సేవలకు సేవాపన్ను నుంచి మినహాయింపు కొనసాగుతోంది.

వ్యవసాయదారులు తప్ప మిగతా అందరూ జీఎస్టీ కింద నమోదు చేసుకోవాలని, వారి ఉత్పత్తులు సేవా పన్ను కిందకు వస్తాయా? లేదా? అనేది జీఎస్టీ మండలి నిర్ణయిస్తుందని తెలిపారు. ప్రస్తుతానికి మినహాయింపుల జాబితా రూపొందించలేదని, వ్యవసాయ ఉత్పత్తులపై పన్ను విధించకపోవచ్చని అధియా పేర్కొన్నారు.

కాగా ప్రస్తుతం 15 శాతం కంటే తక్కువ పన్ను వసూలు చేస్తున్న రవాణా వంటి రంగాలపై సేవా పన్ను తక్కువ ఉండేలా ప్రయత్నిస్తామని, రవాణా రంగాన్ని 5 లేదా 12 శాతం పన్ను జాబితాలో చేర్చే అవకాశముందన్నారు. అలాగే అధిక శాతం శాతం వస్తువుల్ని సామాన్యుడికి ఇబ్బంది కలిగించకుండా తక్కువ పన్ను జాబితాలోనే చేర్చవచ్చని, కొన్ని వస్తువులపై అధిక పన్ను వసూలు చేయవచ్చని తెలిపారు.

జీఎస్టీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
జీఎస్టీకి సంబంధించిన నాలుగు సహాయక చట్టాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీంతో జూలై 1 నుంచి దేశమంతా ఒకే పన్ను వసూలుకు మార్గం మరింత సుగమమైంది. రాష్ట్రపతి ఆమోదించిన చట్టాల్లో కేంద్ర జీఎస్టీ చట్టం 2017, సమీకృత జీఎస్టీ చట్టం 2017, జీఎస్టీ(రాష్ట్రాలకు పరిహారం)చట్టం–2017, కేంద్ర పాలిత ప్రాంత జీఎస్టీ చట్టం 2017లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ బిల్లుల్ని మార్చి 29న లోక్‌సభ, ఏప్రిల్‌ 6న రాజ్యసభ ఆమోదించాయి.

సీజీఎస్టీలో భాగంగా రాష్ట్ర పరిధిలో సరుకుల సరఫరా, సేవలపై పన్ను వసూలు చేస్తారు. ఇక సమీకృత జీఎస్టీలో.. రాష్ట్రాల మధ్య వస్తువుల సరఫరా, సేవలపై కేంద్రానికి పన్ను విధించే అవకాశముంటుంది. జీఎస్టీ అమలుతో ఏర్పడే రాష్ట్రాల రెవెన్యూ నష్టాల్ని జీఎస్టీ పరిహార చట్టం మేరకు భర్తీచేస్తారు . కేంద్ర పాలిత ప్రాంతాల్లో వస్తువుల సరఫరా, సేవలపై పన్నును వసూలు చేసేందుకు యూటీజీఎస్టీ అవకాశం కల్పిస్తుంది. కాగా మే 18, 19న జరిగే జీఎస్టీ మండలి భేటీలో ఏఏ వస్తువులు ఏ పన్ను పరిధిలో ఉంచాలన్న అంశంపై చర్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement