జాతీయగీతం వస్తుంటే నిలబడలేదని...
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ సినిమా థియేటర్లో జాతీయ గీతాన్ని అవమానించినందుకు ఏడుగురు వ్యక్తులపై కేసు పెట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జాతీయ గీతం విషయంలో నమోదైన మొట్టమొదటి కేసు ఇదే. చెన్నై కాశీ థియేటర్లో జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు ఒక మహిళ సహా మొత్తం ఏడుగురు నిలబడలేదు. దాంతో వారితో మరో బృందం వివాదానికి దిగింది. నిందితులపై పోలీసులు జాతీయ గౌరవ చట్టం 1971 కింద కేసులు పెట్టారు.
సినిమా ప్రదర్శించే ముందు ప్రతి థియేటర్లో తప్పనిసరిగా జాతీయ గీతం వినిపించాలని సుప్రీంకోర్టు గత నెలలో ఆదేశించింది. తాజాగా చెన్నై థియేటర్లో జరిగిన గొడవ గురించి విజయకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విజయకుమార్, అతడి స్నేహితులు ఎంత చెప్పినా కూడా 52 సెకండ్ల పాటు జాతీయగీతం వచ్చినప్పుడు అవతలివాళ్లు నిలబడలేదు. దాంతో ఇరు వర్గాల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. విజయకుమార్, అతడి స్నేహితులు తమను తిట్టడం మొదలుపెట్టారని.. ఇంటర్వెల్ సమయంలో తమను కొట్టారని, జాతీయ గీతం వచ్చేటప్పుడు నిలబడాలా వద్దా అన్నది తమ ఇష్టమని చెప్పడం వల్లే ఇదంతా జరిగిందని నిందితుల్లో ఒకరైన లీనస్ రోఫన్ చెప్పారు. తమను దూషించి, కొట్టినందుకు విజయకుమార్ బృందంపై కూడా వీళ్లు కేసు పెట్టారు.