
పెళ్లికూతుళ్లు దొరకడం మరింత కష్టం
మన దేశంలో ఇప్పటికే పెళ్లి కాని ప్రసాదులు చాలా మంది ఉన్నారు. పెళ్లికూతుళ్లు దొరకడం ఇబ్బంది అవుతోంది. అయినా మనవాళ్లు మాత్రం ఇంకా అబ్బాయిలే కావాలని, అమ్మాయిలు వద్దని అంటున్నారు. 2011-13 సంవత్సరాల మధ్య ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 909 మంది అమ్మాయిలు పుడితే, 2012-14 మధ్య ఈ సంఖ్య మరింత తగ్గి 906కు చేరుకుంది. ఈ లెక్కన పెళ్లి చేసుకోవాలనుకున్నా.. అమ్మాయిలు దొరకడం ఇంకా కష్టం అవుతుంది.
అమ్మాయిల జననాల్లో ఢిల్లీ పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో 887 మంది పుడితే, ఇప్పుడు 876 మందే పుట్టారు. తర్వాతి స్థానంలో యూపీ ఉంది. 2014 సంవత్సరానికి సంబంధించిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లెక్కలు తాజాగా విడుదలయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో లింగనిష్పత్తి దారుణంగా ఉందని, తమిళనాడులో కూడా తగ్గుతోందని తెలిసింది. తమిళనాడులో ఇంతకుముందు వెయ్యి మంది అబ్బాయిలకు 927 మంది అమ్మాయిలు పుడితే, ఇప్పుడు 921 మందే పుట్టారు. అంతర్జాతీయంగా చూస్తే ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 950 లేదా అంతకంటే ఎక్కువ మంది అమ్మాయిలు పుడుతున్నారు. భారత దేశంలో మాత్రం పున్నామ నరకం నుంచి కాపాడేది పుత్రుడేనంటూ అబ్బాయిల కోసం చూడటం ఎక్కువైంది.