
'భారత్ అమ్మీ కి జై' ఆయనకు ఓకేనా?
ముంబై: గొంతు మీద కత్తిపెట్టినా.. 'భారతమాతకు జై' అనను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ.. అసదుద్దీన్ వ్యాఖ్యలపై మండి పడ్డారు. శుక్రవారం ఓ ప్రయివేట్ కార్యాక్రమంలో మాట్లాడిన ఆమె.. అసదుద్దీన్ ఓవైసీకి భారత్ మాతాకీ జై అనడానికి బదులుగా.. 'భారత్ అమ్మీ కి జై' అనడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని ప్రశ్నించింది. భారత్ మాతాలో 'మాతా' అనే పదంతోనే సమస్య అయినప్పుడు.. మాతాకు బదులుగా అమ్మీ అని పలకడానికి ఆయనకు ఓకేనా అని షబానా ప్రశ్నించింది.
షబానా భర్త, రచయిత జావేద్ అక్తర్ సైతం అసదుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎంఐఎం లీడర్ తన వ్యాఖ్యలతో దేశంలో అశాంతిని కలిగిస్తున్నాడని ఆయన విమర్శించారు. హైదరాబాద్లో తప్ప ఎక్కడి నుంచైనా తాను అసదుద్దీన్పై ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.