బుఖారీ ఆఫర్ని చీపురుతో ఊడ్చిన ఆప్
న్యూ ఢిల్లీ : జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ ఇచ్చిన ఆఫర్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది. ఢిల్లీలో నివసించే ముస్లింలందరూ ఆప్కి ఓటు వేయాలని బుఖారీ పిలుపునిచ్చారు. మసీదులో ప్రార్థనలకి వచ్చిన ముస్లింలందరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒకే పార్టీకి ఓటు వేయాలన్నారు. మతతత్వ పార్టీలకి కాకుండా లౌకిక పార్టీలని గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బీజేపీ దేశాన్ని మతపరంగా విభజించాలని చూస్తుందని ఆయన విమర్శించారు. ముస్లింల అభివృద్ధికి సహకరించే లౌకిక పార్టీ అయిన ఆప్కి ఓటు వేయాలని సూచించారు. కిందటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బుఖారీ ఆప్కి వ్యతిరేకంగా మట్లాడి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చారు.
బుఖారీ భావజాలానికి ఆప్ వ్యతిరేకం అని తమకి ఆయన మద్దతు అవసరం లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. బుఖారీ తన కుమారున్ని జామా మసీదు తదుపరి షాహీ ఇమామ్గా పట్టాభిషేకం చేసే కార్యక్రమానికి భారత ప్రధానిని ఆహ్వానించలేదు. ఈ కార్యక్రమానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ని పిలిచి బుఖారీ తన అసలు రంగు బయట పెట్టుకున్నారని సంజయ్ సింగ్ విమర్శించారు.