'శక్తిమాన్'కు బీజేపీ నేతల పరామర్శ
డెహ్రడూన్: బీజేపీ నేతల దాడిలో గాయపడిన పోలీసు గుర్రం 'శక్తిమాన్'కు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ మూగజీవం నాలుగు కాళ్లపై నిలబడలేకపోతోందని వైద్యులు తెలిపారు. అమెరికా డాక్టర్ తో పాటు ముంబై నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు దీనికి చికిత్స అందిస్తున్నారు. 14 ఏళ్ల ఈ శ్వేత అశ్వం పదేళ్లుగా పోలీసు బెటాలియన్ కు సేవలందిస్తూ పలు పతకాలు సాధించింది.
ఎమ్మెల్యే గణేశ్ జోషి సహా పలువురు బీజేపీ నేతలు గురువారం 'శక్తిమాన్'పై దగ్గరకు వచ్చారు. వైద్య సేవలను స్వయంగా పర్యవేక్షించారు. గుర్రంపై దాడి కేసులో గణేశ్ జోషి ప్రధాన నిందితుడుగా ఉన్నారు. తాను మానవత్వంతో ఇక్కడికి వచ్చానని, గుర్రాన్ని కొట్టలేదని అన్నారు. మూగజీవం గాయపడడం తనను బాధించిందని తెలిపారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం బీజేపీ నిర్వహించిన ఆందోళన సందర్భంగా 'శక్తిమాన్'పై కాషాయ నేతలు విచక్షణారహతంగా దాడి చేశారు. ఈ కేసులో ప్రమోద్ బొరా అనే బీజేపీ కార్యకర్తను హల్ద్ వానిలో పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డెహ్రడూన్ ఎస్ఎస్పీ సదానంద డేట్ తెలిపారు.