మోడీ ప్రమాణానికి షరీఫ్ | Sharif come to modi the criteria of pm | Sakshi
Sakshi News home page

మోడీ ప్రమాణానికి షరీఫ్

Published Sun, May 25 2014 1:27 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీ ప్రమాణానికి షరీఫ్ - Sakshi

మోడీ ప్రమాణానికి షరీఫ్

1.ఎల్లుండి మోడీ, షరీఫ్ చర్చలు
2.ఎనిమిది దేశాల అధినేతల రాక
3.వారందరితోనూ మోడీ చర్చలు
4.{పమాణస్వీకారానికి సోనియా, రాహుల్

 
 ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: మూడు రోజుల సస్పెన్స్‌కు తెర పడింది. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరు కానున్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారానికి కొద్ది ముందుగా ఆయన భారత్ చేరుకుంటారు. మంగళవారం ఉదయం ఇరువురు ప్రధానులూ ముఖాముఖి చర్చలో పాల్గొంటారు. మోడీ ప్రమాణానికి రావాల్సిందిగా ఇతర సార్క్ దేశాధినేతలతో పాటు షరీఫ్‌ను కూడా భారత్ మే 21న ఆహ్వానించడం తెలిసిందే. అందుకు షరీఫ్ అంగీకరించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ శనివారం విలేకరులకు తెలిపారు. పాక్ సహా మొత్తం 8 దేశాల అధినేతలు రానున్నట్టు వివరించారు. షరీఫ్‌తో పాటు ఆయన జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్, ప్రత్యేక సహాయకుడు తారిక్ ఫతేమీ, విదేశాంగ కార్యదర్శి అజీజ్ చౌధురి తదితరులు కూడా రానున్నారు. షరీఫ్ రాక పట్ల కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. సీమాంతర ఉగ్రవాదం, ముంబై దాడి విచారణ నత్తనడక, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అప్పగింత తదితరాలను ఆయనతో ప్రస్తావించాలని మోడీకి కేంద్ర మంత్రి మనీశ్ తివారీ సూచించారు. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దన్నారు. పాక్ రాజకీయ పార్టీలన్నీ షరీఫ్ నిర్ణయాన్ని స్వాగతించాయి. మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా కార్యక్రమానికి హాజరు కానున్నారు.

షరీఫ్ నిర్ణయానికి ముందు శుక్రవారమంతా పాక్‌లో కొద్దిపాటి డ్రామా నడిచింది. షరీఫ్ భారత పర్యటనకు ఆ దేశ అతివాదులతో పాటు సైన్యం అంగీకరిస్తుందా, లేదా అంటూ ఊహాగానాలు సాగుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో షరీఫ్ సోదరుడు, పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ శుక్రవారం రాత్రి ఆర్మీ చీఫ్ రషీల్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. భారత ఆహ్వానాన్ని అంగీకరించాల్సిన ఆవశ్యకత గురించి నచ్చజెప్పినట్టు సమాచారం. ప్రమాణ స్వీకారానికి వెళ్లడమే సముచితమంటూ షరీఫ్ కూతురు, పాలక పీఎంఎల్ (ఎన్) నేత మరియం షరీఫ్‌తో పాటు పాక్‌కు చెందిన పలువురు జర్నలిస్టు ప్రముఖులు కూడా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఎన్నికల విజయానంతరం మోడీకి షరీఫ్ ఫోన్ చేసి అభినందించడం, పాక్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించడం తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స, అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు కర్జాయ్, భూటాన్ ప్రధాని తొబ్గే, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, మాల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూం, మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్ గులాం ఇప్పటికే అంగీకారం తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని సోమవారం జపాన్ పర్యటనలో ఉండనున్నారు. దాంతో ఆమె తరఫున పార్లమెంటు స్పీకర్ షిరిన్ చౌధురి రానున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానులతో అక్షర క్రమంలో వరుసగా మోడీ భేటీ అవుతారు.
 
నమో చేప... ఫ్రీ.. ఫ్రీ... ఫ్రీ
 
చెన్నై: నమో జ్వరం దేశాన్నింకా వదల్లేదు. మోడీ ప్రమాణస్వీకారం సందర్భంగా తమిళనాడు వాసులకు ఆ రాష్ట్ర బీజేపీ శాఖ బంపర్ బొనాంజా ప్రకటించింది. సోమవారం ఒక్కొక్కరికీ కిలో చొప్పున ఉచితంగా ‘నమో చేపల’ను పంచి పెట్టనుంది. నమో చేపలంటే మరేమీ లేదు. స్థానికంగా బాగా ఆదరణ ఉండే శంకర, కోల వంటి చేప రకాలనే నమో పేరిట పంచుతారన్నమాట. అయితే ఈ పంపకాన్ని కేవలం 200 మందికే పరిమితం చేయనుండటం కాస్త మింగుడు పడని విషయమే!
 
నమో మామిడి
 
లక్నో: మ్యాంగో కింగ్‌గా పేరొందిన ప్రఖ్యాత మామిడి పెంపకందారు పద్మశ్రీ హాజీ కలీముల్లా నరేంద్ర మోడీ పేరుతో ఒక కొత్త మామిడి రకాన్ని సృష్టించారు. దానికి నమో ఆమ్ (మామిడి) అని పేరు పెట్టారు. ఇది అందానికి మారుపేరైన హుస్న్-ఏ-అరా, రుచిలో సాటి లేని దశహరీ రకాల మేలుకలయిక అని చెబుతున్నారాయన. ఇది త్వరలో మార్కెట్లోకి రానుందని చెప్పారు. అయితే తొట్ట తొలి నమో మామిడిని స్వయంగా మోడీ రుచి చూడాలని ఆకాంక్షిస్తున్నారు. కలీముల్లా గతంలో కూడా పలువురు ప్రముఖుల పేరిట ఎన్నో మామిడి రకాలను సృష్టించారు. ఒకే చెట్టులో ఏకంగా 300 రకాల మామిడి రకాలను అభివృద్ధి చేయడం ద్వారా సంచలనం సృష్టించారు.
 
ప్రమాణ స్వీకారానికి చాయ్‌వాలా
 
 వడోదర నుంచి మోడీ లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన చాయ్‌వాలా కిరణ్ మహీదా సోమవారం ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. పలు దేశాధినేతలు, రాజకీయ, సినీ తదితర రంగాల దిగ్గజాలతో పాటు కిరణ్‌కు కూడా మోడీ నుంచి ఆహ్వానం అందింది మరి! దాంతో ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాను చాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించానని మోడీ తరచూ చెబుతారన్నది తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement