అప్పుడు అడ్డుకున్నది ఎవరు?
- షీనా మృతదేహం మూడేళ్ల కిందటే దొరికినా కేసు ఎందుకు పెట్టలేదు? తాజా విచారణకు ఐజీపీ ఆదేశం
అలీబేగ్/ముంబై: సంచలనం సృష్టిస్తున్న షీనా బోరా హత్య మిస్టరీ మరో మలుపు తిరిగింది. మూడేళ్ల కిందట రాయ్‌గఢ్ జిల్లా పెన్ తాలూకాలో షీనా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. దానికి సంబంధించి ఎటువంటి హత్య లేదా ప్రమాద మరణం కేసునూ నమోదు చేయలేదని పోలీసులు అంగీకరించారు. దీంతో ఆనాడు విచారణను ఎవరు అడ్డుకున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీడియా రంగానికి చెందిన ఉన్నతస్థాయి వ్యక్తి ఇంద్రాణి ముఖర్జియా కుమార్తె షీనా బోరా 2012లో హత్యకు గురైన విషయం కొద్ది రోజుల కిందటే వెలుగు చూడ్డం తెలిసిందే. షీనాను ఆమె తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, ఆమె డ్రైవర్ కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించటం విదితమే. '2012 మే 23వ తేదీన సగం కాలి, పాడైపోయివున్న స్థితిలో ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించిన ఒక వ్యక్తి సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఆ పంచనామా నిర్వహించి.. కొన్ని అవశేషాలను జేజే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పుడు ఎటువంటి కేసూ నమోదు చేయలేదు. స్టేషన్ డైరీలో మాత్రం నమోదు చేశారు' అని రాయ్‌గఢ్ ఎస్పీ సువేజ్ హక్ శనివారం అలీబేగ్‌లో విలేకరులకు చెప్పారు. ఇందుకు కారణాలు, చేసిన తప్పులపై విచారణ జరపాలన కొంకణ్ రేంజ్ ఐజీపీ తనను ఆదేశించినట్లు తెలిపారు. దీంతో కేసుకు మసిపూసి మాఫీ చేయటానికి అప్పుడే ప్రయత్నాలు జరిగాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కేసు నమోదు చేయకపోవటంపై విచారణ నివేదిక అనంతరం తప్పు చేసిన అధికారులపై చర్యలు చేపడతామని డీజీపీ సంజీవ్ దయాల్ పేర్కొన్నారు. ఇదిలావుంటే.. శుక్రవారం వెలికితీసిన షీనా అస్థికలను ఫోరెన్సిక్, డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం పంపిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
నన్ను కూడా చంపేవారు: షీనా తమ్ముడు
షీనాను ఏ కారులో గొంతు నులిమి చంపారని నిందితులు వెల్లడించారో.. ఆ కారును పోలీసులు గుర్తించారు. ఆ కారును సమకూర్చిన వ్యక్తిని త్వరలో ప్రశ్నించే అవకాశముంది. ఇదిలావుంటే.. షీనా తమ్ముడు మైఖేల్ బోరా పోలీసుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. తన తల్లి ఇంద్రాణి తనను కూడా చంపాలని కుట్ర పన్నినట్లు చెప్పారు. షీనాను హత్య చేసిన రోజున తాను కూడా.. ఖన్నా బసచేసిన హోటల్‌లో ఉన్నానని, మత్తుమందు కలిపిన నీటిని తనకు ఇవ్వజూపారని, కానీ తాను తప్పించుకోగలిగానని ఆయన వివరించినట్లు సమాచారం. షీనా హత్యకు తాను సహకరించానని చెప్పిన సంజీవ్ ఖన్నా.. పోలీసుల విచారణలో మైఖేల్ బోరాను కూడా తాము హత్య చేసి ఉండేవారమని అంగీకరించినట్లు తెలిసింది. ముగ్గురు నిందితులను రాయ్‌గఢ్‌లో షీనాను హత్య చేసిన అటవీ ప్రాంతానికి మరోసారి తీసుకెళ్లనున్నారు.