మోదీ విందుకు హాజరు కానున్న శివసేన ఎంపీలు
బీజేపీ-శివసేన ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్ధవ్ ఆసక్తి: ఆర్పీఐ
ముంబై/న్యూఢిల్లీ: బీజేపీ, శివసేనలు విభేదాలు తొలగించుకుని మళ్లీ దగ్గరవుతున్నాయి. మహారాష్ట్రలో ఈ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎంపీలకు ఇవ్వనున్న విందుకు సేన ఎంపీలందరూ హాజరుకానున్నారు. తనతో పాటు పార్టీ ఎంపీలంతా పాల్గొంటారని శివసేన ఎంపీ, కేంద్ర కేబినెట్‌లోని ఆ పార్టీ ఏకైక మంత్రి అనంత్ గీతే శుక్రవారం చెప్పారు. ఇది ఎంపీల విందే కనుక తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే హాజరు కారని మరో శివసేన నేత అన్నారు.
మోదీని కలవడానికి ఉద్ధవ్‌కు విందు ఆహ్వానం అక్కర్లేదని, కలవాలంటే నేరుగా వెళ్లి కలుస్తారన్నారు. కాగా ఉద్ధవ్ ఆదేశంపై మంగళవారం బీజేపీ నేతలతో చర్చలు జరిపిన సేన రాజ్యసభ ఎంపీ అనంత్ దేశాయ్ గురువారం మాట్లాడుతూ.. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే రెండు పార్టీల లక్ష్యమన్నారు. మరోపక్క, మహారాష్ట్రలో బీజేపీతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఉద్ధవ్ ఎంతో ఆసక్తి చూపుతున్నారని రిపబ్లికన్ పార్టీ ఇండియా చీఫ్ అథవాలే ముం బైలో చెప్పారు. కాగా, రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమవుతున్నారు. తాము ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెలేలున్న బహుజన్ వికాస్ అఘాది పార్టీ మద్దతు కూడగట్టామని, ముగ్గురు ఎమ్మెల్యేలున్న పెజంట్స్‌అండ్ వర్కర్స్ పార్టీతో చర్చ లు జరుపుతున్నామని బీజేపీ తెలిపింది. మరోవైపు రాష్ట్ర బీజేపీ ఛీఫ్ ఫడణ్‌వీస్ సీఎం పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. తాను సీఎం పదవి రేసులో లేనని కేంద్ర మంత్రి గడ్కారీ స్పష్టం చేశారు.
దగ్గరవుతున్న బీజేపీ, శివసేన
Published Sat, Oct 25 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM
Advertisement