Anant Geete
-
మెట్రో కోచ్‌ల తయారీలోకి భెల్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ భెల్ మెట్రో రైలు కోచ్‌ల తయారీరంగంలోకి ప్రవేశించనున్నదని కేంద్ర మంత్రి అనంత్ గీతే తెలిపారు. భారత్‌లో నాలుగు విదేశీ కంపెనీలతో కలిసి లిథియమ్–ఆయాన్ బ్యాటరీలను తయారు చేసే సాధ్యాసాధ్యాలపై ఈ కంపెనీ కసరత్తు చేస్తోందని ఆయన వివరించారు. ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి ఉద్దేశించిన ఫేమ్ ఇండియా రెండో దశ సెప్టెంబర్ తర్వాత ప్రారంభమవుతుందని ఒక పత్రికా సమావేశంలో ఆయన చెప్పారు. ఫేమ్ రెండో దశ అమలు కోసం రూ.9,300 కోట్లు కేటాయించాలని బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని, దీంట్లో రూ.1,000 కోట్లు ఛార్జింగ్ సదుపాయాల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. లిథియమ్ అయాన్ జేవీలో 20% వాటా భెల్‌కు, మిగిలిన 80%వాటా ఆ నాలుగు కంపెనీలకు ఉంటాయని తెలిపారు. -
నేపాల్‌కు గోల్డ్‌స్టోన్ ‘ఈ–బజ్ కే6’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాదీ కంపెనీ గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ తాజాగా ఈ–బజ్ కే6 మోడల్‌ను తయారు చేసింది. కేంద్ర మంత్రి అనంత్ గీతే చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించిన ఈ బస్‌లను.. నేపాల్‌కు ఎగుమతి చేస్తున్నట్లు గోల్డ్‌స్టోన్ ఈడీ నాగ సత్యం చెప్పారు. 7 మీటర్ల పొడవున్న ఈబజ్ కే6 బస్‌లో 18 మంది కూర్చునే వీలుంది. ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. మూడు నాలుగు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. చైనాకు చెందిన బీవైడీ భాగస్వామ్యంతో గోల్డ్‌స్టోన్ ఈ బస్‌లను తయారు చేస్తోంది. భారత్‌లో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల కోసం చైనాపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా త్వరలో భారత్ కూడా తయారు చేయగలదని కేంద్ర మంత్రి అనంత్ గీతే తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విస్తృత వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో అనంత్ గీతే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం చైనా నుంచి లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, బస్సుల్లో ఉపయోగించే వాటి కోసం ఒక్కో దానికి రూ. 50–60 లక్షలు అవుతోందని మంత్రి చెప్పారు. బ్యాటరీల ఖర్చు తగ్గితే, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా అందుబాటు స్థాయిలోకి వస్తాయన్నారు. -
దగ్గరవుతున్న బీజేపీ, శివసేన
మోదీ విందుకు హాజరు కానున్న శివసేన ఎంపీలు బీజేపీ-శివసేన ప్రభుత్వ ఏర్పాటుపై ఉద్ధవ్ ఆసక్తి: ఆర్పీఐ ముంబై/న్యూఢిల్లీ: బీజేపీ, శివసేనలు విభేదాలు తొలగించుకుని మళ్లీ దగ్గరవుతున్నాయి. మహారాష్ట్రలో ఈ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఆదివారం ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎంపీలకు ఇవ్వనున్న విందుకు సేన ఎంపీలందరూ హాజరుకానున్నారు. తనతో పాటు పార్టీ ఎంపీలంతా పాల్గొంటారని శివసేన ఎంపీ, కేంద్ర కేబినెట్లోని ఆ పార్టీ ఏకైక మంత్రి అనంత్ గీతే శుక్రవారం చెప్పారు. ఇది ఎంపీల విందే కనుక తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే హాజరు కారని మరో శివసేన నేత అన్నారు. మోదీని కలవడానికి ఉద్ధవ్‌కు విందు ఆహ్వానం అక్కర్లేదని, కలవాలంటే నేరుగా వెళ్లి కలుస్తారన్నారు. కాగా ఉద్ధవ్ ఆదేశంపై మంగళవారం బీజేపీ నేతలతో చర్చలు జరిపిన సేన రాజ్యసభ ఎంపీ అనంత్ దేశాయ్ గురువారం మాట్లాడుతూ.. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే రెండు పార్టీల లక్ష్యమన్నారు. మరోపక్క, మహారాష్ట్రలో బీజేపీతో కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఉద్ధవ్ ఎంతో ఆసక్తి చూపుతున్నారని రిపబ్లికన్ పార్టీ ఇండియా చీఫ్ అథవాలే ముం బైలో చెప్పారు. కాగా, రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమవుతున్నారు. తాము ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెలేలున్న బహుజన్ వికాస్ అఘాది పార్టీ మద్దతు కూడగట్టామని, ముగ్గురు ఎమ్మెల్యేలున్న పెజంట్స్‌అండ్ వర్కర్స్ పార్టీతో చర్చ లు జరుపుతున్నామని బీజేపీ తెలిపింది. మరోవైపు రాష్ట్ర బీజేపీ ఛీఫ్ ఫడణ్‌వీస్ సీఎం పదవి చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. తాను సీఎం పదవి రేసులో లేనని కేంద్ర మంత్రి గడ్కారీ స్పష్టం చేశారు. -
ఎన్డీయేలోనే శివసేన
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం నుంచి తాను వైదొలగబోనని శివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విచ్ఛిన్నమైనప్పటికీ.. తమ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగుతుందని చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయనపై విధంగా స్పందించారు. అనంత్ గీతే శివసేన నుంచి కేంద్ర కేబినెట్లో ఏకైక మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపంకంపై ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో 25 ఏళ్ల నుంచి మిత్ర పక్షంగా ఉన్న శివసేనతో పొత్తును బీజేపీ వదులుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గం నుంచి శివసేన తప్పుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి. వీటిపై గీతే స్పందిస్తూ.. ఈ అంశంపై తాను పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించానని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పారు. తాము ఎన్డీయే భాగస్వాములుగా కొనసాగుతామని చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో శివసేన కీలక పాత్ర పోషించిందన్నారు. మహారాష్ట్రలో సాధించిన 42 ఎంపీ స్థానాల్లో తమ పాత్రా కీలకమేనని చెప్పారు. అందువల్ల రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత బీజేపీ, సేన కలిసే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా, భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం సరైనది కాదన్నారు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని వ్యాఖ్యానించారు. గురువారం ఉద్ధవ్ ఠాక్రే మోదీతో సమావేశమవుతారన్న వార్తలకు సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ** -
ఒక్కసారి అధికారమివ్వండి
సాక్షి, ముంబై: తమ పార్టీకి ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండీ, రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని అభివృద్ధి చేసి చూపిస్తానని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఉద్ఘాటించారు. ఠాకూర్ విలేజ్‌లో ఆదివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మొదటి ప్రచార సభలో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్పీఐ పార్టీలను లక్ష్యంగా విమర్శనాస్త్రాలను సంధించారు. ఆయా పార్టీల నాయకులపై ఘాటుగా విమర్శలు చేశారు. 10-15 రోజులుగా సీట్ల సర్దుబాటుపై ఇరు కూటములు తర్జన భర్జన పడ్డాయి. చర్చలు జరుపుతున్నట్లు నాటకాలాడాయని ఆరోపించారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఓ బీజేపీ నాయకుడికి ఫోన్ చేసి ‘మీరు శివసేనతో తెగతెంపులు చేసుకున్న అర గంటకే మేం కూడా కాంగ్రెస్‌తో విడిపోతామని’ చెప్పారని ఆరోపించారు. ఈ సమయంలో బాల్ ఠాక్రే బతికి ఉన్నట్లయితే బీజేపీ ఇలా వ్యహరించే సాహసం చేసేదికాదన్నారు. ఆయన హయాంలో రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరిగేవి, ఎలా పొత్తు సాగేదని మరోసారి గుర్తు చేశారు. ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని, అందరూ స్వార్థపరులేనని ఇలాంటి పార్టీలను ఎలా నమ్మాలో తెలియడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలకు ఓటర్లు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలేపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినట్లు చెప్పుకోవడాన్ని ఎద్దెవా చేశారు. ఈ ఆఫర్ విని బయటవారే కాదు ఇంట్లో వాళ్లు కూడా నవ్వుకుని ఉండవచ్చని అన్నారు. ముంబై ఇతర ప్రాంతీలకు అడ్డగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం, స్థలం దొరికి న చోట గుడిసెలు వేసుకోవడం.. ఇలా వెలసిన మురికివాడలను ప్రభుత్వం పునరాభివృద్థి పథకం కింద వారికి పక్క ఇళ్లు నిర్మించి ఇవ్వడం, తరువాత వాటిని అమ్ముకుని మళ్లీ గుడిసెలు వేయడం ఇలా ద శాబ్ధాల నుంచి జరుగుతుందన్నారు. తమ పార్టీ అధికారంలో వస్తే ఏం చేస్తామో అందుకు సంబంధించిన బ్ల్యూ ప్రింట్ ఇటీవల విడుదల చేశానని, ఆ ప్రకారం కచ్చితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని మీకు హామీ ఇస్తున్నానని అన్నారు. -
‘గీతే’ దాటతారా?
సాక్షి ముంబై: శివసేనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మహాకూటమి నుంచి వేరైన శివసేన ఇప్పటికే ఒంటరైంది. కూటమిలోని మిగతా పార్టీలు బీజేపీ పంచన చేరాయి. పైగా సేనలోని కీలక నేతలు కొందరు బీజేపీవైపు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో తాము మోడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని, తమ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర కేబినెట్ మంత్రి అనంత్ గీతే తన పదవికి రాజీనామా చేస్తారని ఉద్ధవ్ స్వయంగా ప్రకటించారు. అయితే గీతే మాత్రం తాను రాజీనామా చేసే యోచనలో లేనని చెప్పారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడానికి తాము కూడా కారణమేనని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని శనివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఉద్ధవ్ గీతే రాజీనామ చేయడం ద్వారా మోడీ సర్కారుకు తాము మద్దతు ఉపసంహరించుకుంటామన్నారు. దీంతో గీతే విషయంలో కూడా ఉద్ధవ్ అయోమయంలో పడినట్లు చెబుతున్నారు. మరి బీఎంసీలో పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం నుంచి బయటపడనుందని శివసేన ప్రకటించిన అనంతరం ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో పరిస్థితి ఏమటనే విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘తమ అనుకూలమైనప్పుడు ఒక్కటవుతారు. కానప్పుడు విడిపోతారు. మరి కేంద్రంలో అధికారంలో నుంచి బయటపడతారా..?’ అని ఎమ్మెన్నెస్ అధ్యక్షులు రాజ్‌ఠాక్రేను శివసేనను ప్రశ్నించిన వెంటనే ఉద్ధవ్ ఠాక్రే కూడా స్పందించారు. తమ పార్లమెంట్ సభ్యుడు అనంత్ గీతే తన పదవికి రాజీనామా చేస్తారని, ప్రధాని రాగానే మంత్రి పదవికి రాజీనామా చేస్తూ లేఖ సమర్పిస్తారని పేర్కొన్నారు. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విషయమై ఎలాంటి సమాధానం తెలుపకుండానే అన్ని నిర్ణయాలను త్వరలో ప్రకటిస్తామంటూ దాటవేశారు. దీంతో రాబోయే రోజుల్లో శివసేన, బీజేపీల కూటములు అధికారంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో కూడా ప్రత్యర్థులుగా మారతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నుంచి ముప్పులేదు... కొంకణ్ రీజియన్ మహామండలికి బీఎంసీలో శివసేననే అధికారంలో కొనసాగుతుందని ఇటీవలే బీజేపీ లిఖిత పూర్వకంగా లేఖ అందజేసింది. దీంతో ఇంతట్లో ఆ పార్టీకి బీజేపీ నుంచి ముప్పులేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎమ్మెన్నెస్ అధ్యక్షులు రాజ్ ఠాక్రే విసిరిన సవాళ్లకు ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాల్సి ఉంది. 1997 నుంచి బీఎంసీలో శివసేన, బీజేపీలు కలిసి అధికారాన్ని పంచుకుంటున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, స్థాయి సమితి, ఇతర కీలక పదవులు వారివారి సంఖ్యాబలం ఆధారంగా చేపడుతున్నాయి. ప్రస్తుతం 227 మంది కార్పొరేటర్లున్న బీంసీలో శివసేన 75, బీజేపీ 32, 12 మంది ఇండిపెండెంట్లను కలుపుకొని 119 కార్పొరేటర్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. రెండున్నరేళ్ల అనంతరం గడువు ముగిసిన తర్వాత ఇటీవలే మేయర్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మేయర్‌గా పోటీ చేసిన స్నేహల్ అంబేకర్‌కు 122 ఓట్లు వచ్చాయి. దీన్నిబట్టి మరో ముగ్గురి సంఖ్యా బలం కూడా పెరింగింది. అయితే రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ మద్దతును ఉపసంహరించుకున్నా అధికారాన్ని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. తుది నిర్ణయం పార్టీదే: కోటే షోలాపూర్, న్యూస్‌లైన్: కార్యకర్తలు, ప్రముఖులతో చర్చించి ఎక్కడి నుంచి పోటీచేయాలనేది తుది నిర్ణయం తీసుకుంటానని రెండు చోట్ల నామినేషన్ వేసిన శివసేన మాజీ మేయర్ మహేశ్ కోటే తెలిపారు. షోలాపూర్ సెంట్రల్ సిటీ నియోజక వర్గం నుంచి శివసేన టికెటుపై, షోలాపూర్ నార్త్ సిటీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు. పత్రాల పరిశీలనలో రెండు నామినేషన్లకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం, కార్యకర్తల తో చర్చించి ఎక్కడి నుంచి బరిలో దిగుతాననేది ప్రకటిస్తానని చెప్పారు. -
కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోనున్న శివసేన
ముంబై: మహారాష్ట్రలో బీజేపీతో చెలిమి చెడడంతో కేంద్ర కేబినెట్ నుంచి వైదొలగాలని శివసేన నిర్ణయించింది. ఎన్డీఏ సర్కారులో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తమ పార్టీ నేత అనంత్ గీతే పదవి నుంచితప్పుకుంటారని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అనంత్ గీతే మంత్రి పదవికి రాజీనామా చేస్తారని వెల్లడించారు. మోడీ ప్రభుత్వంలో శివసేన తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మంత్రి అనంత్ గీతే. వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో బీజేపీ, శివసేన వేరుబాట పట్టాయి. -
ఖాయిలా పీఎస్‌యూలకు చికిత్స
న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) కంపెనీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చికిత్స మొదలుపెట్టింది. మహారత్న, నవరత్న దిగ్గజాలతో పాటు ఇతర పీఎస్‌యూల వద్ద భారీ మొత్తంలో ఉన్న మిగులు నిధులను పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నట్లు భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి అనంత్ గీతే చెప్పారు. శుక్రవారమిక్కడ జరిగిన భారత వాహన తయారీదారుల సంఘం(సియామ్) వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను అధ్యయనం చేసేందుకు ఎన్టీపీసీ చైర్మన్ అరూప్ రాయ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించామని.. రెండు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించనుందని కూడా గీతే పేర్కొన్నారు. నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు ప్రారంభ(సీడ్) ఈక్విటీ నిధులను సమకూర్చడం ద్వారా ఒక జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేయడం.. తద్వారా నష్టజాతక పీఎస్‌యూల నిర్వహణ, పునరుద్ధరణకు గల అవకాశాలను కమిటీ పరిశీలించనుంది. ‘మహారత్న, నవరత్న హోదా ఉన్న సీపీఎస్ఈలకు చెందిన రూ.2 లక్షల కోట్ల మేర మిగులు నిధులు బ్యాంకుల్లో నిరుపయోగంగా ఉన్నట్లు అంచనా. ఈ కంపెనీలన్నింటికీ సమాన ఈక్విటీ వాటా ఉండేవిధంగా ఒక జేవీ ఏర్పాటు ప్రతిపాదనను మేం రూపొందించాం. దీనిద్వారా ఇప్పుడున్న 70 ఖాయిలా పీఎస్‌యూల్లో 43 కంపెనీలను పునరుద్ధరించేందుకు వీలవుతుంది’ అని గీతే వివరించారు. ఏ ఖాయిలా కంపెనీని పునరుద్ధరించాలనేది కొత్తగా నెలకొల్పే జేవీ సమీక్షించి, నిర్ణయించనుందని.. దీనికి సంబంధించి పూర్తి భాధ్యతను జేవీకే ఇవ్వాలనేది తమ ప్రతిపాదనగా ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం నిధుల కల్పన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టనున్నామని కూడా గీతే తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులపై త్వరలో నిర్ణయం... కాగా, నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్(ఎన్ఈఎంఎంపీ)ను అమలు చేసే ప్రతిపాదనపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా బ్యాటరీతో నిడిచే ఎలక్ట్రిక్ వాహనాలను(బస్సులు) ప్రజా రవాణాకోసం వినియోగించాలనేది ఈ మిషన్ ప్రధానోద్దేశమని చెప్పారు. దేశంలోనే అత్యంత కాలుష్యభరితమైన నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉందని.. జాబితా నుంచి దీన్ని తొలగించడం కోసం ఈ నగరం నుంచే ఎన్ఈఎంఎంపీని ప్రారంభించనున్నట్లు గీతే పేర్కొన్నారు. 2020కల్లా 60-70 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని మిషన్ అంచనా వేస్తోంది. -
బీజేపీ, శివసేనల మధ్య తొలగిన విభేదాలు!
న్యూఢిల్లీ: మంత్రి పదవుల కేటాయింపుల వ్యవహారంలో బీజేపీ, శివసేనల మధ్య చోటుచేసుకున్న విభేదాలు పరిష్కారమయ్యాయి. ప్రధాని నర్మేంద్ర మోడీతో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. దాంతో శివసేన కు కేటాయించిన భారీ పరిశ్రమల శాఖను చేపట్టేందుకు అనంత్ గీతే అంగీకరించారు. బుధవారం ఉదయం 11 గంటలకు గీతే మంత్రి పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. మంత్రి పదవుల కేటాయింపుపై ప్రస్తుతం ఎలాంటి అసంతృప్తి లేదు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కీలక పదవులు దక్కేలా పార్టీ దృష్టిపెట్టింది అని గీతే మీడియాతో అన్నారు. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గీతే.. తనకు కేటాయించిన భారీ పరిశ్రమల శాఖను చేపట్టేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇరుపార్టీల మధ్య విబేధాలు నెలకొన్నాయి. అయితే మోడీ, ఉద్దవ్ లు ఓ అవగాహనకు రావడంతో తాత్కాలికంగా విభేదాలను పక్కన పెట్టారు. -
శాఖల కేటాయింపుపై శివసేన అలక
ముంబై: కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వానికి అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయి. నూతన మంత్రివర్గం ఏర్పడి 24 గంటలు గడవకముందే అలకలు మొదలయ్యాయి. కేంద్ర కేబినెట్ లో శాఖల కేటాయింపుపై శివసేన గుర్రుగా ఉంది. తాము అడిగిన శాఖలు ఇవ్వలేదంటూ శివసేన అలకవహించింది. తమ పార్టీకి కేటాయించిన భారీ పరిశ్రమల శాఖను అంగీకరించే విషయంపై సమాలోచనలు జరుపుతోంది. ఈ శాఖను అంగీకరించాలా, వద్దా అనే దానిపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే రేపు నిర్ణయం తీసుకుంటారని అనంత్ గీతే తెలిపారు. మోడీ మంత్రివర్గంలో ఆయనకు అనంత్ గీతేకు భారీ పరిశ్రమల శాఖ కేటాయించారు. తమ పార్టీకి కోరిన శాఖ ఇవ్వలేదన్న కారణంతో ఆయన ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు.