‘గీతే’ దాటతారా? | Shiv Sena's Anant Geete to quit Modi's Cabinet | Sakshi
Sakshi News home page

‘గీతే’ దాటతారా?

Published Mon, Sep 29 2014 10:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

Shiv Sena's Anant Geete to quit Modi's Cabinet

సాక్షి ముంబై: శివసేనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మహాకూటమి నుంచి వేరైన శివసేన ఇప్పటికే ఒంటరైంది. కూటమిలోని మిగతా పార్టీలు బీజేపీ పంచన చేరాయి. పైగా సేనలోని కీలక నేతలు కొందరు బీజేపీవైపు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో తాము మోడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని, తమ పార్టీ నేత, పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర కేబినెట్ మంత్రి అనంత్ గీతే తన పదవికి రాజీనామా చేస్తారని ఉద్ధవ్ స్వయంగా ప్రకటించారు.

అయితే గీతే మాత్రం తాను రాజీనామా చేసే యోచనలో లేనని చెప్పారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడానికి తాము కూడా కారణమేనని, రాజీనామా చేసే ప్రసక్తే లేదని శనివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఉద్ధవ్ గీతే రాజీనామ చేయడం ద్వారా మోడీ సర్కారుకు తాము మద్దతు ఉపసంహరించుకుంటామన్నారు. దీంతో గీతే విషయంలో కూడా ఉద్ధవ్ అయోమయంలో పడినట్లు చెబుతున్నారు.

 మరి బీఎంసీలో పరిస్థితి ఏంటి?
 కేంద్ర ప్రభుత్వం నుంచి బయటపడనుందని శివసేన ప్రకటించిన అనంతరం ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిస్థితి ఏమటనే విషయంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘తమ అనుకూలమైనప్పుడు ఒక్కటవుతారు. కానప్పుడు విడిపోతారు. మరి కేంద్రంలో అధికారంలో నుంచి బయటపడతారా..?’ అని ఎమ్మెన్నెస్ అధ్యక్షులు రాజ్‌ఠాక్రేను శివసేనను ప్రశ్నించిన వెంటనే ఉద్ధవ్ ఠాక్రే కూడా స్పందించారు.

 తమ పార్లమెంట్ సభ్యుడు అనంత్ గీతే తన పదవికి రాజీనామా చేస్తారని,  ప్రధాని రాగానే మంత్రి పదవికి రాజీనామా చేస్తూ లేఖ సమర్పిస్తారని పేర్కొన్నారు. అయితే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విషయమై ఎలాంటి సమాధానం తెలుపకుండానే అన్ని నిర్ణయాలను త్వరలో ప్రకటిస్తామంటూ దాటవేశారు. దీంతో రాబోయే రోజుల్లో శివసేన, బీజేపీల కూటములు అధికారంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో కూడా ప్రత్యర్థులుగా మారతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 బీజేపీ నుంచి ముప్పులేదు...
 కొంకణ్ రీజియన్ మహామండలికి బీఎంసీలో శివసేననే అధికారంలో కొనసాగుతుందని ఇటీవలే బీజేపీ లిఖిత పూర్వకంగా లేఖ అందజేసింది. దీంతో ఇంతట్లో ఆ పార్టీకి బీజేపీ నుంచి ముప్పులేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఎమ్మెన్నెస్ అధ్యక్షులు రాజ్ ఠాక్రే విసిరిన సవాళ్లకు ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాల్సి ఉంది. 1997 నుంచి బీఎంసీలో శివసేన, బీజేపీలు కలిసి అధికారాన్ని పంచుకుంటున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, స్థాయి సమితి, ఇతర కీలక పదవులు వారివారి సంఖ్యాబలం ఆధారంగా చేపడుతున్నాయి.

ప్రస్తుతం 227 మంది కార్పొరేటర్లున్న బీంసీలో శివసేన 75, బీజేపీ 32, 12 మంది ఇండిపెండెంట్లను కలుపుకొని 119 కార్పొరేటర్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది. రెండున్నరేళ్ల అనంతరం గడువు ముగిసిన తర్వాత ఇటీవలే మేయర్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మేయర్‌గా పోటీ చేసిన స్నేహల్ అంబేకర్‌కు 122 ఓట్లు వచ్చాయి. దీన్నిబట్టి మరో ముగ్గురి సంఖ్యా బలం కూడా పెరింగింది. అయితే రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ మద్దతును ఉపసంహరించుకున్నా అధికారాన్ని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 తుది నిర్ణయం పార్టీదే: కోటే
 షోలాపూర్, న్యూస్‌లైన్: కార్యకర్తలు, ప్రముఖులతో చర్చించి ఎక్కడి నుంచి పోటీచేయాలనేది తుది నిర్ణయం తీసుకుంటానని రెండు చోట్ల నామినేషన్ వేసిన శివసేన మాజీ మేయర్ మహేశ్ కోటే తెలిపారు. షోలాపూర్ సెంట్రల్ సిటీ నియోజక వర్గం నుంచి శివసేన టికెటుపై, షోలాపూర్ నార్త్ సిటీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు. పత్రాల పరిశీలనలో రెండు నామినేషన్లకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం, కార్యకర్తల తో చర్చించి ఎక్కడి నుంచి బరిలో దిగుతాననేది ప్రకటిస్తానని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement