సాక్షి, ముంబై : సీబీఐ వివాదానికి సంబంధించి మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని శివసేన విమర్శలతో విరుచుకుపడింది. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిన సీబీఐని సొంత ఆస్తిలా మార్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం ఆందోళన వ్యక్తం చేసింది. గుజరాత్ కేడర్ ఆఫీసర్, సీబీఐలో నెంబర్ టూ స్ధానంలో ఉన్న రాకేష్ ఆస్ధానా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు నమ్మినబంటని పేర్కొంది.
సీబీఐపై ఇప్పటి వరకూ పలు ఆరోపణలు వచ్చినా, ఈ తరహా బురదచల్లుకునే పరిణామాలు ఇంతకు ముందెన్నడూ చోటుచేసుకోలేదని వ్యాఖ్యానించింది. బీజేపీ ప్రభుత్వంలో కట్టిపడేసిన కుక్కలా సీబీఐ వ్యవహారశైలి ఉందని సామ్నా ఎడిటోరియల్ దుయ్యబట్టింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాల అంతర్యుద్ధం, ఇరువురిపై వచ్చిన అవినీతి ఆరోపణలతో దర్యాప్తు ఏజెన్సీ విశ్వసనీయతపై సర్వత్రా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. సీబీఐ కీచులాటల నేపధ్యంలో ఉన్నత స్ధాయి దర్యాప్తు సంస్థపై మోదీ సర్కార్ పట్టు కోల్పోయిందని కాంగ్రెస్ సహా విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి.
సీబీఐలో పరిస్థితులను చక్కదిద్దేందుకు సర్వోన్నత న్యాయస్ధానం చొరవ తీసుకుంది. అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను రెండు వారాల్లో పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సీవీసీని ఆదేశించింది. మరోవైపు సీబీఐ నూతన చీఫ్‌గా నియమితులైన ఎం నాగేశ్వరరావు పరిపాలనా వ్యవహారాలనే పర్యవేక్షించాలని, విధాన నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment