ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై బీజేపీ సహా ఆ రాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారి అనుసరిస్తున్న తీరు పట్ల శివసేన మండిపడింది. వరదలతో దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని, తమకు ఓటు వేయని రైతులపై కేంద్రం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడరాదని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన దుయ్యబట్టింది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోనందుకు కేంద్రం రైతులపై ప్రతీకారం తీర్చుకోరాదని తాము కోరుతున్నామని సంపాదకీయంలో శివసేన పేర్కొంది.మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిని రాజాగా అభివర్ణించిన సేన ఆయన రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మోకాలడ్డుతున్నారని ఆరోపించింది. హెక్టార్‌కు రూ 25,000 చొప్పున రైతులకు పరిహారం ప్రకటించాలని శివసేన కేంద్రాన్ని డిమాండ్ చేసింది. రైతుల తరపున తాము ఢిల్లీ (కేంద్రం)తో పోరాడుతున్నామని పేర్కొంది. బీజేపీ మాటలు ఓ రకంగా ఉంటే చేతలు మరోరకంగా ఉంటాయని విమర్శించింది.
Comments
Please login to add a commentAdd a comment