మధ్యప్రదేశ్ మళ్లీ బీజేపీదే!
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 230 స్థానాలకు గానూ 165 సీట్లు సాధించి వరుసగా మూడోసారి అధికార పీఠం దక్కించుకుంది. హ్యాట్రిక్ సీఎంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ కేవలం 58 స్థానాల్లో గెలుపొంది ఘోర పరాజయం చవిచూసింది. బీఎస్పీ 4 సీట్లలో, ఇతరులు 3 చోట్ల విజయం సాధించారు. బీజేపీ గెలుపుపై ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చౌహాన్‌కు అభినందనలు తెలిపారు. 2003 ఎన్నికల్లో 173 స్థానాలు, 2008లో 143 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈ సారి 165 సీట్లలో గెలుపొందింది. బుధ్ని, విదిశ స్థానాల నుంచి పోటీచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్ సమీప కాంగ్రెస్ ప్రత్యర్థులపై వరుసగా 84,805 ఓట్లు, 17వేల పైచిలుకు ఓట్ల తేడాతో రెండు చోట్లా గెలుపొందారు.
బీజేపీ గెలుపోందడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అయితే, బీజేపీ తరఫున పోటీచేసిన 30 మంది మంత్రుల్లో పదిమంది ఓడిపోవడం విశేషం. వారిలో మాజీ ప్రధాని వాజ్‌పేయి మేనల్లుడు అనూప్ మిశ్రా కూడా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం చౌహాన్ మంత్రివర్గంలో సభ్యుడైన బాబూలాల్ గౌర్ గోవింద్‌పుర స్థానం నుంచి వరుసగా పదోసారి గెలిచి రికార్డ్ సృష్టించారు. ఈ సారి ఆయన మెజారిటీ 70,644 కావడం విశేషం. శివపురి స్థానంలో బీజేపీ తరఫున యశోధర రాజె సింధియా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్ధన్ రాఘోగఢ్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు. కాంగ్రెస్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అజయ్‌సింగ్ చుర్హత్ స్థానం నుంచి గెలుపొందారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి సురేశ్ పచౌరీ భోజ్‌పూర్ స్థానం ఓటమి పాలయ్యారు.
2005 నుంచి అప్రతిహతంగా..!
2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తరువాత ఉమాభారతి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత బాబూలాల్ గౌర్ స్వల్పకాలం సీఎంగా ఉన్నారు. అనంతరం శివరాజ్‌సింగ్ చౌహాన్ 2005లో సీఎం పదవి చేపట్టారు. అభివృద్ధిలో వెనకబడి ‘బీమారు’ రాష్ట్రాల్లో ఒకటిగా పేరుగాంచిన మధ్యప్రదేశ్ చౌహాన్ హయాంలో అత్యధిక జీడీపీ సాధించి అభివృద్ధి బాట పట్టింది.
విజయానికి అనుకూలించిన అంశాలు
శివరాజ్‌సింగ్ చౌహాన్ సంప్రదాయ, మితవాద వ్యక్తిత్వం, ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు, ప్రభుత్వ అనుకూల ఓటు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక ప్రగతి.
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, వ్యవసాయంపై చూపిన ప్రత్యేక శ్రద్ధ
ప్రతిపక్షంగా కాంగ్రెస్ వైఫల్యం, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ అవినీతి.
మోడీని పీఎం చేయాలి
‘మధ్యప్రదేశ్ ప్రజలు వరుసగా మూడోసారి బీజేపీపై తమ ప్రేమాభిమానాలను చూపారు. వారికి ఎంతో కృతజ్ఞుడిని. ఇది బీజేపీ సిద్ధాంతాలకు లభించిన విజయం. సుశిక్షితులైన పార్టీ కార్యకర్తల కృషి వల్లనే ఇది సాధ్యమైంది. నా స్థానంలో ఎవరున్నా బీజేపీనే గెలిచేది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి, మోడీని ప్రధానిని చేయడమే మా తదుపరి లక్ష్యం’
- ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్