sivaraj singh chauhan
-
Sivasena: శభాష్ చౌహన్‌జీ.. దేశానికి మార్గం చూపారు
ముంబై: ప్రస్తుత కరోనా సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని శివసేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్ర సేవలను ప్రశంసించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు అభినందనలు తెలిపింది. ఒక బీజేపీ ముఖ్యమంత్రికి అభినందనలు తెలపడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇంతకీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటంటే.. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగులుతున్న చిన్నారులకు ఉచిత విద్యతో పాటు నెలకు పింఛన్ రూపేణ రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మంగళవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై తాజాగా శివసేన స్పందించింది. ఆ పార్టీ గొంతుకగా భావించే ‘సామ్నా’ పత్రికలో మధ్యప్రదేశ్‌ప్రభుత్వ చర్యలను కొనియాడుతూ సంపాదకీయం ప్రచురించింది. ఈ పిల్లల బాధ్యత చూసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని తెలపడం అభినందనీయమని శివసేన కొనియాడింది. ఉచిత విద్యతో పాటు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామనడంపై అభినందించింది. (‘సామ్నా’ సంపాదకీయం చదవండి) ‘కరోనాతో దేశం వెనకబడుతున్న తరుణంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ.5 వేల పింఛన్ అందిస్తామని ప్రకటించడంపై అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఇది మానవత్వంలో గొప్ప అడుగు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దేశానికి ఒక సందేశం అందిస్తున్నారు’ అని సంపాదకీయంలో శివసేన పేర్కొంది. అనాథ చిన్నారుల విషయంలో దేశానికి మధ్యప్రదేశ్‌ప్రభుత్వం ఒక మార్గం చూపిందని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్రలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కీర్తిస్తూనే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా’ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రూ.25,000 కోట్లతో చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అవనసరంగా శివసేన ‘సామ్నా’లో స్పష్టం చేసింది. -
అయోధ్య తీర్పు; విగ్రహావిష్కరణ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దివంగత మాజీ కేంద్రమంత్రి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ సింగ్ విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. భోపాల్ లోని రద్దీగా ఉండే ఓ రోడ్డు జంక్షన్లో అర్జున్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు నిర్ణయించారు. అయితే గతంలో అక్కడ స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ అజాద్ విగ్రహం ఉండేది. ఆ ప్రదేశంలోనే అర్జున్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘అజాద్ విగ్రహం గతంలో ఎక్కడ ఉండేదో తిరిగి అక్కడే ప్రతిష్టించాల’ని ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘దేశమాత ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ అజాద్ విగ్రహం తొలగించడం ఆయనను అవమానించడమే. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. అజాద్ విగ్రహాన్ని తొలగించిన చోటనే పునః ప్రతిష్టించాలి. లేదంటే దేశం వారిని ఎన్నటికీ క్షమించదు’ అని చౌహన్ అన్నారు. ‘ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణ చేసే పనుల్లో భాగంగా మూడేళ్ల క్రితమే అజాద్ విగ్రహాన్ని తీసి మరో ప్రదేశంలో నెలకొల్పార’ని బీఎంసీ అధికారులు చెబుతున్నారు. అర్జున్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గురించి కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పౌరసంఘాల అధికారులు తనను ఎప్పుడూ సంప్రదించలేదని బీజేపీ నేత, భోపాల్ మేయర్ అలోక్ శర్మ స్పష్టం చేశారు. దీనిపై బీఎంసీ కమిషనర్ బి.విజయ్ దత్తా వాదన మరోలా ఉంది. అర్జున్ సింగ్ విగ్రహం ఏర్పాటు గురించి కాంగ్రెస్‌నేతలు, బీఎంసీ అధికారులు మేయర్‌ను కలిశామని, అయితే ఆ విషయాన్ని మాత్రం మేయర్ వెల్లడించడం లేదని చెబుతున్నారు. వాస్తవానికి ఈనెల 11న అర్జున్‌సింగ్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉండగా అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ కార్యక్రమం వాయిదా పడింది. -
‘అసెంబ్లీకి వాస్తు దోషం ఉంది’
భోపాల్ : వాస్తు, గ్రహదోషాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ రాజకీయ నాయకులు మాత్రం వాటిని విపరీతంగా విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా ఇటువంటి వారు అధికంగానే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. మధ్యప్రదేశ్ శాసనసభకు వాస్తు దోషం ఉందని.. అందువల్లే ప్రజాప్రతినిధులు అర్థాంతరంగా మరణిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కేపీ సింగ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణమే శాసనసభ భవానికి వాస్తు శాంతి చేయించాలని ఆయన పేర్కొన్నారు. 2013 నుంచి ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు హఠాత్తుగా మృతి చెందారని కేపీ సింగ్ చెప్పారు. ప్రస్తుత సభకు ఇంకా ఏడాది కాలపరిమితి ఉన్న నేపథ్యంలో.. ప్రకృతి మరిన్ని ప్రాణాలను కోరుతున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సభకు రావాలంటేనే భయమేస్తోందని అన్నారు. ప్రస్తుత విధాన సభకు శాస్త్రప్రకారం వాస్తు పూజ చేసి, ఇతర దోష నివారణ చర్యలు చేపట్టాలని కేపీసింగ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. ఇదిలా ఉండగా.. 1993 నుంచి మధ్యప్రదేశ్ శాసనసభకు వాస్తు దోషం ఉందనే వాదనలు బలంగా విపిస్తున్నాయి. -
14న ప్రమాణ స్వీకారం చేయనున్న చౌహాన్
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈనెల 14న వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భోపాల్‌లోని జంబోరీ మైదానంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సహా అగ్రనేతలు హాజరు కానున్నారు. కాగా, చౌహాన్ సోమవారం గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌కు తన రాజీనామాను సమర్పించారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆయనను కోరినట్లు చెప్పాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ డిసెంబర్ 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
మధ్యప్రదేశ్ మళ్లీ బీజేపీదే!
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 230 స్థానాలకు గానూ 165 సీట్లు సాధించి వరుసగా మూడోసారి అధికార పీఠం దక్కించుకుంది. హ్యాట్రిక్ సీఎంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ కేవలం 58 స్థానాల్లో గెలుపొంది ఘోర పరాజయం చవిచూసింది. బీఎస్పీ 4 సీట్లలో, ఇతరులు 3 చోట్ల విజయం సాధించారు. బీజేపీ గెలుపుపై ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చౌహాన్‌కు అభినందనలు తెలిపారు. 2003 ఎన్నికల్లో 173 స్థానాలు, 2008లో 143 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈ సారి 165 సీట్లలో గెలుపొందింది. బుధ్ని, విదిశ స్థానాల నుంచి పోటీచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్ సమీప కాంగ్రెస్ ప్రత్యర్థులపై వరుసగా 84,805 ఓట్లు, 17వేల పైచిలుకు ఓట్ల తేడాతో రెండు చోట్లా గెలుపొందారు. బీజేపీ గెలుపోందడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అయితే, బీజేపీ తరఫున పోటీచేసిన 30 మంది మంత్రుల్లో పదిమంది ఓడిపోవడం విశేషం. వారిలో మాజీ ప్రధాని వాజ్‌పేయి మేనల్లుడు అనూప్ మిశ్రా కూడా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం చౌహాన్ మంత్రివర్గంలో సభ్యుడైన బాబూలాల్ గౌర్ గోవింద్‌పుర స్థానం నుంచి వరుసగా పదోసారి గెలిచి రికార్డ్ సృష్టించారు. ఈ సారి ఆయన మెజారిటీ 70,644 కావడం విశేషం. శివపురి స్థానంలో బీజేపీ తరఫున యశోధర రాజె సింధియా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్ధన్ రాఘోగఢ్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు. కాంగ్రెస్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అజయ్‌సింగ్ చుర్హత్ స్థానం నుంచి గెలుపొందారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి సురేశ్ పచౌరీ భోజ్‌పూర్ స్థానం ఓటమి పాలయ్యారు. 2005 నుంచి అప్రతిహతంగా..! 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తరువాత ఉమాభారతి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత బాబూలాల్ గౌర్ స్వల్పకాలం సీఎంగా ఉన్నారు. అనంతరం శివరాజ్‌సింగ్ చౌహాన్ 2005లో సీఎం పదవి చేపట్టారు. అభివృద్ధిలో వెనకబడి ‘బీమారు’ రాష్ట్రాల్లో ఒకటిగా పేరుగాంచిన మధ్యప్రదేశ్ చౌహాన్ హయాంలో అత్యధిక జీడీపీ సాధించి అభివృద్ధి బాట పట్టింది. విజయానికి అనుకూలించిన అంశాలు శివరాజ్‌సింగ్ చౌహాన్ సంప్రదాయ, మితవాద వ్యక్తిత్వం, ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు, ప్రభుత్వ అనుకూల ఓటు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక ప్రగతి. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, వ్యవసాయంపై చూపిన ప్రత్యేక శ్రద్ధ ప్రతిపక్షంగా కాంగ్రెస్ వైఫల్యం, కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వ అవినీతి. మోడీని పీఎం చేయాలి ‘మధ్యప్రదేశ్ ప్రజలు వరుసగా మూడోసారి బీజేపీపై తమ ప్రేమాభిమానాలను చూపారు. వారికి ఎంతో కృతజ్ఞుడిని. ఇది బీజేపీ సిద్ధాంతాలకు లభించిన విజయం. సుశిక్షితులైన పార్టీ కార్యకర్తల కృషి వల్లనే ఇది సాధ్యమైంది. నా స్థానంలో ఎవరున్నా బీజేపీనే గెలిచేది. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి, మోడీని ప్రధానిని చేయడమే మా తదుపరి లక్ష్యం’ - ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ -
నలుగురిలో చౌహానే ధనిక సీఎం
న్యూఢిల్లీ: ఆదివారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాలుగు రాష్ట్రాలకు బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నవారి ఆస్తులు, అప్పుల వివరాలివి(ఎన్నికల సంఘానికి వారు తెలిపిన లెక్కల ప్రకారం). మట్టిమనిషి.. శివరాజ్‌సింగ్ చౌహాన్ సాధుశీలి. మృదుభాషి. నిరాడంబరతకు మారుపేరు. సాదాసీదా ఆహార్యంతో చూడగానే ‘మనలో ఒకడు’ అన్పించే వ్యవహార శైలి శివరాజ్‌సింగ్ చౌహాన్ సొంతం. వీటికి తోడు రైతు బిడ్డ అన్న తిరుగులేని ఇమేజీ. సొంత పార్టీతో పాటు దేశమంతా నరేంద్ర మోడీ నామ జపం చేస్తున్నా, 54 ఏళ్ల ఈ హ్యాట్రిక్ వీరుడు మాత్రం ఎప్పట్లాగే లో ప్రొఫైల్‌నే నమ్ముకున్నారు. తనదైన శైలిలో మధ్యప్రదేశ్‌లో బీజేపీని వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. 1959లో శిహోర్ జిల్లా జౌత్ గ్రామంలో ప్రేమ్‌సింగ్ చౌహాన్, సుందర్ బాయి అనే రైతు దంపతులకు జన్మించిన చౌహాన్లోని నాయకత్వ లక్షణాలు పాఠశాల దశలోనే బయటపడ్డాయి. ఎమర్జెన్సీ సమయంలో ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు జైలుపాలయ్యారు. ఆరెస్సెస్ కార్యకర్త అయిన చౌహాన్ ఫిలాసఫీలో గోల్డ్ మెడలిస్టు కూడా. 1990లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగి అసెంబ్లీకి వెళ్లారు. అనంతరం విదిశ నుంచి ఐదుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం సాధించిపెట్టిన ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి ఏడాదికే తప్పుకోవడంతో చౌహాన్ దశ తిరిగింది. తర్వాత ఏడాది పాటు సీఎంగా ఉన్న బాబూలాల్ గౌర్ నుంచి 2005లో పగ్గాలు స్వీకరించిన ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఈసారి వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకున్నారు. ‘గత పదేళ్లలో నేను రాష్ట్రాన్ని సీఎంగా పాలించలేదు. మీ సోదరునిగా, కొడుకుగా, మామయ్యగా పాలించాను’ అంటూ గ్రామీణుల మది దోచుకున్నారు. మృదుత్వం పాళ్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఆయన అంత ప్రభావశీలి కారని విమర్శకులు అంటుంటారు.