నలుగురిలో చౌహానే ధనిక సీఎం
న్యూఢిల్లీ: ఆదివారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాలుగు రాష్ట్రాలకు బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నవారి ఆస్తులు, అప్పుల వివరాలివి(ఎన్నికల సంఘానికి వారు తెలిపిన లెక్కల ప్రకారం).
మట్టిమనిషి.. శివరాజ్‌సింగ్ చౌహాన్
సాధుశీలి. మృదుభాషి. నిరాడంబరతకు మారుపేరు. సాదాసీదా ఆహార్యంతో చూడగానే ‘మనలో ఒకడు’ అన్పించే వ్యవహార శైలి శివరాజ్‌సింగ్ చౌహాన్ సొంతం. వీటికి తోడు రైతు బిడ్డ అన్న తిరుగులేని ఇమేజీ. సొంత పార్టీతో పాటు దేశమంతా నరేంద్ర మోడీ నామ జపం చేస్తున్నా, 54 ఏళ్ల ఈ హ్యాట్రిక్ వీరుడు మాత్రం ఎప్పట్లాగే లో ప్రొఫైల్‌నే నమ్ముకున్నారు. తనదైన శైలిలో మధ్యప్రదేశ్‌లో బీజేపీని వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. 1959లో శిహోర్ జిల్లా జౌత్ గ్రామంలో ప్రేమ్‌సింగ్ చౌహాన్, సుందర్ బాయి అనే రైతు దంపతులకు జన్మించిన చౌహాన్‌లోని నాయకత్వ లక్షణాలు పాఠశాల దశలోనే బయటపడ్డాయి. ఎమర్జెన్సీ సమయంలో ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు జైలుపాలయ్యారు.
ఆరెస్సెస్ కార్యకర్త అయిన చౌహాన్ ఫిలాసఫీలో గోల్డ్ మెడలిస్టు కూడా. 1990లో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగి అసెంబ్లీకి వెళ్లారు. అనంతరం విదిశ నుంచి ఐదుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం సాధించిపెట్టిన ఫైర్‌బ్రాండ్ ఉమాభారతి ఏడాదికే తప్పుకోవడంతో చౌహాన్ దశ తిరిగింది. తర్వాత ఏడాది పాటు సీఎంగా ఉన్న బాబూలాల్ గౌర్ నుంచి 2005లో పగ్గాలు స్వీకరించిన ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఈసారి వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకున్నారు. ‘గత పదేళ్లలో నేను రాష్ట్రాన్ని సీఎంగా పాలించలేదు. మీ సోదరునిగా, కొడుకుగా, మామయ్యగా పాలించాను’ అంటూ గ్రామీణుల మది దోచుకున్నారు. మృదుత్వం పాళ్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఆయన అంత ప్రభావశీలి కారని విమర్శకులు అంటుంటారు.