ఇక ఆ ప్రహరీలు ఎక్కితే కాల్చేస్తారు
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ లోని భారత వైమానిక స్థావరానికి సంబంధించి ప్రహరీలను ఎవరు ఎక్కేందుకు ప్రయత్నించినా కాల్చిపారేయండంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఈ స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ఈ ఆర్డర్స్ ఇచ్చారు.
'వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఆధీనంలోని అన్ని స్థావరాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ స్థావరాలకు సంబంధించిన ప్రహరీలను ఎవ్వరూ ఎక్కకుండా షూట్ ఎట్ సైట్ ఆదేశాలు ఇచ్చాం' అని వైమానిక దళ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీంతోపాటు ఎయిర్ బేస్కు 100 మీటర్ల దూరంలో, అలాగే, ఆయుధ భాండాగారానికి 900 మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా నిషేధం విధించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోరినట్లు చెప్పారు.