సాక్షి, బెంగళూరు: ఐటీ సిటీలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా పోలీసు, విద్యా శాఖలు ఉమ్మడిగా ముందుకు సాగనున్నాయి. ఈ క్రమంలో తమ పరిధిలో కట్టుదిట్టంగా నియంత్రణ చర్యలు, శిక్షలు వేయాలని నిర్ణయించాయి. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు రోడ్ల దురవస్థ ప్రధాన కారణం కాగా, ద్విచక్ర వాహనాలు రెండో కారణం. ఈ విషయం గుర్తించిన రవాణా శాఖ వివిధ శాఖల సహకారంతో నివారణ చర్యలు చేపట్టనుంది. కర్ణాటక మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన ద్విచక్రవాహనాల్లో వెనక మరొకరు కూర్చొని ప్రయాణం చేయడం నిషిద్ధం. అయినా ఇది అమలు కావడం లేదు.
మైసూరులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం సందర్భంగా కొంతమంది హైకోర్టులో గతంలో ప్రజాహిత వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ విషయం పై రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం 100 సీసీ, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన ద్విచక్రవాహనాల పై ఇక పై పిలియన్ రైడర్స్ (వెనక కుర్చొని ప్రయాణం)కు అవకాశం కల్పించబోరు. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. అదే గనుక జరిగితే రాష్ట్రంలో ద్విచక్రవాహనాల్లో దాదాపు 25 శాతం ద్విచక్రవాహనాలు, స్కూటీల్లో ఒక్కరే ప్రయాణించాల్సిందే. ఈ విధానాన్ని మొదట బెంగళూరులో అమలు చేస్తారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు.
50 సీసీలకు తగ్గించే ఆలోచన ఉంది: రవాణాశాఖ కమిషనర్ : ఈ విషయమై రవాణాశాఖ కమిషనర్ దయానంద్ మాట్లాడుతూ... న్యాయస్థానం సూచన మేరకు 100 సీసీ, అంత కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై పిలియన్ రైడ్‌కు అనుమతించబోము. ఈ నిబంధన కొత్త వాహనాలకు మాత్రమే. ఇప్పటికే కొనుగోలు చేసిన వాటికి వర్తించదు. అయితే 100 సీసీ విషయంలో కొంత వెలుసుబాటు కల్పించే ఆలోచన ఉంది. ఆ సామర్థ్యాన్ని 50 సీసీకు తగ్గించే ఆలోచన ఉంది. ఈ విషయమై త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపనున్నాం.’ అని పేర్కొన్నారు.
విద్యార్థుల బైక్‌లపై నియంత్రణ : నగరంలో ఇటీవల డ్రాగ్‌రేసులు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ఈ డ్రాగ్‌రేసులో ఎక్కువ టీనేజర్లు పాల్గొంటున్నారు. ఈ రేసులు వికటించి యువత ప్రాణాలు తీస్తున్నాయి. ఈ విషయమై దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ డ్రాగ్‌రేసుల్లో పాల్గొనేవారు ఎక్కువగా విద్యార్థులేనని తేలింది. పాఠశాలలకు బైక్‌లు తీసుకువెళ్లి అక్కడి నుంచి రేసింగ్‌కు వెళుతున్నారు. వీరిలో చాలమందికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో డీఎల్‌లేని వారికి విద్యార్థులకు విద్యాసంస్థల్లో పార్కింగ్‌కు అవకాశం కల్పించకూడదని రవాణాశాఖ విద్యాశాఖను కోరింది. ఇందుకు విరుద్ధంగా జరిగితే సదరు విద్యా సంస్థపై చర్యలు తీసుకోవాలన్న రవాణాశాఖ సూచనను కూడా విద్యాశాఖ అంగీకరించింది. మొదట విద్యా సంస్థల్లో అటు పై మాల్స్, సినీథియోటర్లలో ఈ నిబంధనను అమలు చేయనున్నారు.
పిల్లలు నడిపితే పెద్దలపై చర్యలు : ఇక మైనర్లు డీఎల్ లేకుండా బైకులు, కార్లు నడిపితే ఆ వాహనం ఎవరి పైన రిజిస్టర్ అయ్యిందో వారిపై కేసు వేసి అపరాధరుసుం వసూలు చేయాలన్న నిబంధన ఉంది. అయితే ఇందుకు అవసరమైన నిర్థిష్ట చట్టం కర్ణాటక మోటార్ వెహికల్ రూల్స్ 1989లో లేదు. దీంతో పోలీసులు, న్యాయశాఖతో చర్చలు జరిపి మైనర్లు తప్పుచేస్తే వారి తల్లిదండ్రులు లేదా సదరు వాహనం రిజిస్టర్ అయిన వారి పై క్రిమినల్ కేసులు నమోదుచేయనున్నారు. ఈ పరిణామాలతో ద్విచక్రవాహనాల వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలను చాలా వరకూ నియంత్రిచవచ్చునని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.
గత మూడేళ్లలో బెంగళూరులో రోడ్డు ప్రమాదాలు
ఏడాది మొత్తంప్రమాదాలు మృతులు గాయపడినవారు
2015 4828 740 4047
2016 7506 793 4193
2017 3818 499 3182(సెప్టెంబర్ 30)
Comments
Please login to add a commentAdd a comment