
6 ఇడియట్స్
ఎన్నో మంచి చిత్రాలు వస్తున్నా.. అందులోని మంచి కంటే చెడే యువతపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది.
సినిమాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి..! ...ఇది ఎంతోమంది పెద్దల అభిప్రాయం.
ఎన్నో మంచి చిత్రాలు వస్తున్నా.. అందులోని మంచి కంటే చెడే యువతపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది ...ఇది సైకాలజిస్టుల అభిప్రాయం. పెద్దలు, సైకాలజిస్టుల అభిప్రాయాంతో విభేదిస్తున్నారు ఈ ఆరుగురు యువ ఇంజనీర్లు. కేవలం ఓ సినిమా ఇచ్చిన స్ఫూర్తితోనే అంతర్జాతీయస్థాయిలో నిర్వహించే ఓ సైన్స్ కాంపిటీషన్‌లో తామూ పాల్గొంటున్నామని చెబుతున్నారు. ఇంతకీ ఈ వర్ధమాన ఇంజనీర్లు చూసిన సినిమా ఏది? దాని నుంచి పొందిన స్ఫూర్తితో సాధించిన అద్భుతమేంటి? తెలుసుకోవాలనుందా...? అయితే చదవండి..
సాక్షి, స్కూల్ ఎడిషన్: పాపులర్ హిందీ చిత్రం ‘3 ఇడియట్స్’ గురించి విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందులో తన స్నేహితులిద్దరితో కలిసి ఆమిర్‌ఖాన్ చేసిన అల్లరి అంతాఇంతా కాదు. అయితే ఈ సినిమాలో ఆమిర్ చేసిన అల్లరికంటే ఇంజనీరింగ్ విద్యార్థిగా చేసే అద్భుతాలు ప్రేక్షకులను, ముఖ్యంగా యువతరాన్ని ఎంతో ఆకట్టుకుంటాయి. తాము తయారు చేసిన వీడియో డ్రోన్‌తో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటుంటే గుర్తించడం, ప్రొఫెసర్ కూతురు పురినొప్పులతో బాధపడుతుంటే వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించి డెలివరీ చేయడం వంటి సన్నివేశాలకు యువత వందమార్కులు వేశారు.
అంతర్జాతీయస్థాయికి...
ఈ ఇంజనీర్ల బృందం త్వరలో జరగనున్న ఓ అంతర్జాతీయస్థాయి సైన్స్ కాంపిటీషన్‌లో పాల్గొనబోతోంది. అమెరికాలో ఏయూవీఎస్‌ఐ పేరుతో నిర్వహించే పోటీలో పాల్గొనేందుకు భారత్ నుంచి ఈ యువ ఇంజనీర్ల బృందానికి అవకాశం లభించింది. ఈ పోటీకి అమెరికా ఆర్మీకి చెందిన సీనియర్ అధికారులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు.
3 ఇడియట్స్ స్ఫూర్తిగా...
ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులకు 3 ఇడియట్స్ సినిమా ఎంతగానో నచ్చింది. అందులో ఆమిర్‌ఖాన్ బృందం తయారు చేసే డ్రోన్ ఈ ఆరుగురిని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో తామూ అలాంటి డ్రోన్ తయారు చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా పని మొదలుపెట్టారు. మొత్తానికి ఓ అద్భుమైన డ్రోన్‌ను తయారు చేశారు.
ఎన్నో ప్రత్యేకతలు...
డ్రోన్ గాలిలో ఎగిరే చిన్నపాటి హెలిక్యాప్టర్‌లాంటిదనే విషయం మనకు తెలిసిందే. నేలపై ఉండే వ్యక్తి రిమోట్‌కంట్రోల్ సాయంతో దీనిని ఆపరేట్ చేస్తాడు. అయితే వీరు తయారు చేసిన డ్రోన్ మాత్రం ఎన్నో ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంది. జెప్పెలిన్ ఎఫ్‌సీ-26 అని పేరు పెట్టిన ఈ డ్రోన్ స్వయంగా టేకాఫ్ అవుతుంది. దానంతటదే ఎగురుతుంది. ఎవరి సాయం లేకుండానే ల్యాండ్ అవుతుంది. అంతేనా దాదాపు 32 కిలోమీటర్ల దూరం నుంచి మరింత స్పష్టమైన వీడియోలను కంప్యూటర్ స్టేషన్‌కు పంపుతుంది. ఇదంతా ముందుగా సిద్ధం చేసిన సాఫ్ట్‌వేర్ ప్రోగామ్ ద్వారా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్‌ను మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు.
‘ఇటువంటి ఆవిష్కరణల విషయంలో భారతీయులు మిగతావారికంటే వెనుకబడి ఉన్నారు. అందుకు కారణం కొత్త కొత్త ఆవిష్కరణలకు అవసరమైన ప్రోత్సాహం, అవకాశాలు మన దేశంలో తక్కువగా ఉండడమే. సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం, ఆసక్తి ఉన్నవారికి అవకాశాలు లభిస్తే మనదేశం కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలవడానికి ఎంతోకాలం పట్టదు. జెప్పెలిన్ ఎఫ్‌సీ-26తో అమెరికాలో నిర్వహించే ఏయూవీఎస్‌ఐ కాంపిటీషన్‌లో పాల్గొంటున్నాం. తప్పకుండా మా ఆవిష్కరణకు సముచిత గౌరవం దక్కుతుందనే ఆశిస్తున్నాం’ -వైభవ్ గాంగ్వార్ (యువ ఇంజనీర్ల బృందంలో సభ్యుడు)